శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్‌పై కేసు.. ఈసీ వర్గాల్లో కలకలం

-

ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే.. ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహా 11 మందిపై మహబూబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో 21 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఇందులో ఏకంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పైనే కేసు నమోదైంది. సీఈసీతో పాటు సీఈసీ కార్యదర్శి సంజయ్ కుమార్, గతంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్, రాష్ట్ర ఆర్ధికశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్ మరో పలువురు అధికారులపై కేసు నమోదు చేశారు. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలోనూ కీలక అంశంగా మారింది.

ఈ వ్యవహారంలో తదుపరి ఏం చేయాలన్న విషయమై ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్  రెండ్రోజుల క్రితం దిల్లీ వెళ్లారు. కేసు వ్యవహారంపైనే సీఈవో హస్తిన వెళ్లినట్లు సమాచారం. కేసు పూర్వాపరాలు, ఇతర అంశాలపై వికాస్‌రాజ్ తో ఈసీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సీఈసీపై ఈ తరహా కేసు నమోదు కావడం చిన్న విషయం కాదని అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి. అటు కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న విషయమై ఈసీ దృష్టి సారించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version