అసెంబ్లీలో వరద నష్టంపై రగడ.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్​ల మధ్య మాటల యుద్ధం

-

తెలంగాణలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు-వరదలు-నష్టాలు-ప్రభుత్వ సాయంపై శుక్రవారం రోజున శాసనసభలో జరిగిన చర్చ సభను అట్టుడికించింది. ఈ చర్చ బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్ర వాద్వాదానికి దారి తీసింది. నష్టాల అంచనాలు, చెక్‌డ్యాంల నిర్మాణం తీరుపై ఇటు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి.. అటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబుల మధ్య మాటలయుద్ధం సాగింది.

15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. ఎకరానికి రూ.10 వేల సాయం అందించినా రూ.1500 కోట్లు పంట సాయానికే కావాల్సి ఉంటుందని, ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిందని శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రుణమాఫీ అమలు ప్రకటన చేయగానే కాంగ్రెస్‌ వాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయాయని.. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్‌ చాలన్నవారు.. రైతుల గురించి మాట్లాడతారా అని కేటీఆర్ దుయ్యబట్టారు. అంచనాలు పూర్తికాకుండానే వరద నష్టం లెక్కలెలా చెబుతారని ప్రశ్నించారు. రైతులకు మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు బహిరంగంగానే వ్యాఖ్యానించారని అన్నారు.

మరోవైపు చెక్‌డ్యాంల నిర్మాణం శాస్త్రీయంగా జరిగిందా?అనే అంశంపై సభాసంఘాన్ని నియమించాలని కోరారు. పత్రికల్లో వచ్చిన కథనాలు, కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version