తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి.2024-25 బడ్జెట్ కోసం అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు స్వీకరించిన విషయం తెలిసిందే. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు నుంచి ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమావేశం అవుతారు. ఈరోజు మధ్యాహ్నం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన శాఖల ప్రతిపాదనలను భట్టి సమీక్షిస్తారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన శాఖల సమావేశం ఇవాళ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. 19వ తేదీన సీతక్క, దామోదర రాజనర్సింహలకు చెందిన శాఖల సమీక్ష ఉంటుంది. 20వ తేదీన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు.. 22వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ.. 23వ తేదీన పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులకు సంబంధించిన శాఖల సమీక్ష ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25, 27వ తేదీల్లో జరగనున్నాయి. మూడు రోజుల్లో రోజుకు నాలుగు చొప్పున శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను సమీక్షిస్తారు.