‘గాలేరు-నగరి’పై అభ్యంతరం.. కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖలు

-

గాలేరు-నగరి సుజల స్రవంతి, తెలుగు గంగ ప్రాజెక్టులపై అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పనులను నిలువరించాలని కోరుతూ తెలంగాణ నీటిపారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ) సి.మురళీధర్‌ కృష్ణా బోర్డుకు లేఖలు రాశారు. గత నెల 23వ తేదీన ఈ పనులకు ఏపీ సర్కారు టెండర్లు కూడా పిలిచిందని పేర్కొంటూ.. మరింత ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖలో ఇంకా ఏం పేర్కొన్నారంటే…?

‘గాలేరు-నగరి సుజల స్రవంతి ప్యాకేజీ-2లో భాగంగా ప్రధాన కాలువ మట్టి పనులతోపాటు వామికొండ సాగర్‌ జలాశయం, నరెడ్డి శివరామిరెడ్డి (సర్వరాయ సాగర్‌) జలాశయాల కట్టలను బలోపేతం చేసే పనులు, కాలువల నిర్మాణం సహా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది. రూ.130 కోట్ల మేరకు నిధులు కేటాయించింది. ఎస్‌.ఆర్‌.ఎం.సి క్రాస్‌ రెగ్యులేటర్‌, బనకచర్ల, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ల ద్వారా 34 టీఎంసీలు తీసుకునేందుకే ఏపీకి అనుమతి ఉంది. వాటిలో 19 టీఎంసీలు ఎస్‌.ఆర్‌.ఎం.సి, 15 టీఎంసీలు చెన్నై నగర తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంది. కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టులకు మాత్రమే నీటిని వినియోగించుకోవాలని కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ-1) సూచించింది. ఏపీ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.

పోతిరెడ్డిపాడు ద్వారా 1500 క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించాల్సి ఉండగా, దాని సామర్థ్యాన్ని 2006లో 44 వేల క్యూసెక్కులకు విస్తరించారు. ఆ తరువాత 88 వేల క్యూసెక్కులకు విస్తరించే పనులు చేపట్టారు. బనకచర్ల వద్ద గాలేరు-నగరికి 22 వేల క్యూసెక్కులు తరలించేందుకు వీలుగా అదనపు రెగ్యులేటర్‌ నిర్మించారు. కేడబ్ల్యూడీటీ-2 ముందు సెక్షన్‌ 89 నిబంధనల ప్రకారం గాలేరు-నగరి ప్రాజెక్టుకు నీళ్లు కావాలని ఏపీ అప్పీలు చేసుకోలేదు. అయినా మరోమారు ఆ రాష్ట్రం ఈ ప్రాజెక్టు కింద విస్తరణ పనులకు టెండర్లు పిలిచింది. ఈ దశలోనే వాటిని నిలిపివేసేలా చర్యలు చేపట్టండి.

Read more RELATED
Recommended to you

Latest news