గవర్నర్ ప్రజాదర్బార్లు పెట్టకముందే ఆ తరహాలో తామే సమస్యలు వినాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం.అయితే ఇప్పటికే రాజ్ భవన్ దగ్గర ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేశారు గవర్నర్.ప్రజల సమస్యలను ప్రభుత్వం ఆలకించడం లేదని, వారి సమస్యలను తానే వింటానని ప్రజాదర్బార్లు నిర్వహించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై నిర్ణయించారు.ప్రజల మేలు కోసమే రాజ్ భవన్ ఉందని తమిళిసై..ప్రజా సమస్యల పరిష్కారానికి ముందడుగు వేస్తామని ప్రకటించారు.మే నుంచి ప్రజా దర్బార్ నడుస్తుందని ప్రకటించారు.అందులో వచ్చిన సమస్యలు ప్రభుత్వానికి నివేదించడం తప్పు కాదు అన్నారు.ఉగాది వేడుకల సందర్భంగా తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే మే రాకముందే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.గవర్నర్ ప్రజాదర్బార్లు పెట్టకముందే ఆ తరహాలో తామే సమస్యలు వినాలని నిర్ణయించుకున్నారు.జిల్లాలో ప్రతి సోమవారం ప్రజావాణి- గ్రీవెన్స్ డే తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.నిజానికి అంతకు ముందు గ్రీవెన్స్ డే ఉండేది.కానీ గ్రీవెన్స్ డే రెండేళ్లుగా ఆగిపోయింది.ప్రభుత్వ కార్యాలయాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తూ రాజ్ భవన్ దృష్టికి తీసుకెళ్తున్నారు.గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడకు వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ప్రభుత్వం భావించినట్లుగా కనిపిస్తుంది.