తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నియామకమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నేడు రాష్ట్ర కొత్త గవర్నర్గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొత్త గవర్నర్తో ప్రమాణం చేయిస్తారు.
ఈ క్రమంలో ఈరోజు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు త్రిపుర రాజధాని అగర్తల నుంచి జిష్ణు దేవ్ వర్మ కుటుంబ సభ్యులతో కలిసి బయలు దేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రమాణస్వీకారోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తదితరులు హాజరు కానున్నారు.
1957 ఆగస్టు 15న జన్మించిన జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 సేవలందించారు. ఈయన త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులుకాగా, ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తెలంగాణ గవర్నర్‌గా నియమించడం గమనార్హం.