టీఎస్‌ఆర్టీసీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఉద్యోగుల పొదుపు పరపతి సహకార సంఘానికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ వైస్ ఛైర్మన్, ఎండీ వి.సి.సజ్జనార్, చీఫ్ మేనేజర్ బి.సి.విజయ పుష్ప కుమారిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా లేదా, వారి తరఫు న్యాయవాదులు గానీ హాజరై కోర్టు ధిక్కారణపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేశారు.
ఉద్యోగుల సహకార సంఘానికి రూ.639 కోట్లు చెల్లించాల్సి ఉండగా, 4 వారాల్లో రూ.100 కోట్లు, మరో 4 వారాల్లో రూ.100 కోట్లు చెల్లించాలంటూ గత నవంబరులో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ నివేదన మేరకు మే 15 లోపు రూ.50 కోట్లు, తరువాత నవంబరు నుంచి ఆరు నెలలు లోగా మిగిలిన రూ.100 కోట్లు చెల్లించాలని ఏప్రిల్ 26న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఆర్టీసీ అమలు చేయకపోవడంతో ఉద్యోగుల పొదుపు పరపతి సహకార సంఘం ఎండీ, చీఫ్ మేనేజర్లపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ పి.మాధవీదేవి ప్రతివాదులైన ఆర్టీసీ ఎండీ, చీఫ్ మేనేజర్లుకు నోటీసులు జారీ చేశారు.