డిగ్రీ ఉందా : మేమే వోటు పుట్టిస్తాం.. ఎదురు డబ్బిస్తాం !

ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా ఎంతో ముఖ్యమని చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. అది నిజమే, ఎందుకంటే ఒక్క ఓటుతో ప్రభుత్వాలను డిసైడ్ చేసే అవకాశం కూడా ఉంటుందనే విషయం మనకి తెలుసు. కొన్ని సందర్భాల్లో అది నిజమేనని ప్రూవ్ అయింది కూడా. అందుకే ఎన్నికల ప్రచారం వచ్చిందంటే మన నేతల పాట్లు అన్నీ ఇన్నీ కావు. చిన్న పిల్లలకు స్నానం చేయించడం దగ్గర నుంచి ముసలి వాళ్లకి తినిపించడం దాకా ఏది కుదిరితే అది చేసేస్తూ ఉంటారు.

ఇదంతా మామూలు ఎన్నికలకు సంబంధించిన విషయం. అయితే ఇక ప్రతి ఓటు ఎంతో కీలకంగా భావించే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంటుంది. అక్కడ ఒక్క ఓటు ఒక వజ్రం లాగా అన్న మాట. త్వరలో తెలంగాణలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఒక్కో పార్టీ ఒక్కో రకమైన స్కెచ్ వేస్తోంది. ఇప్పుడు మామూలు ఓట్లే రెండు వేల నుంచి ఐదు వేల దాకా పలుకుతున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఓటర్ల డిమాండ్ ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు.

అయినా సరే ఈ ఎమ్మెల్సీ సీట్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఒక్కో ఓటుకి ఎంతైనా ఇచ్చి గెలవడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలు ఒక నియోజకవర్గంగా అలానే వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలు మరో నియోజకవర్గంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఇప్పుడు ఒక ప్రధాన పార్టీ ఎంచుకున్న విధానమే ఆసక్తికరంగా మారింది.

విషయం ఏంటంటే ఈ జిల్లాల్లో ఎంతోమంది పట్టభద్రులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పార్టీ ఫ్రెస్ గ్రాడ్యుయేట్ లకు ఓట్లు పుట్టించే పనిలో పడింది. నిజానికి ఈ జిల్లాల్లో పట్టభద్రులు ఎంతమంది ఉన్నా ఆ ఓటరుగా నమోదు చేసుకుంటే మాత్రమే ఓటు వేసే అవకాశం లభిస్తుంది. కానీ ఇది కొంచెం టెక్నికల్ ప్రాసెస్ కావడంతో చాలా మంది ఆ టైం కూడా వెచ్చించడానికి సిద్ధంగా లేరు. నిజానికి చాలా మందికి ఇప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్రాధాన్యతా విధానంలో ఓటు ఎలా వేయాలో తెలియదు. అందుకే 2014లో జరిగిన ఎన్నికలలో వేల సంఖ్యలో ఇన్‌ వ్యాలిడ్ వోట్లు వచ్చాయి.

ఇప్పుడు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే క్రమంలో కూడా డిగ్రీ/డిప్లొమా సర్టిఫికెట్లతో పాటు గెజిటెడ్ అధికారి ధృవీకరణ ఉండాలన్న నిబంధన అంతా తికమకగా ఫీలయి చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఈ అంశాన్నే దీన్నే తమకు అనుకూలంగా మార్చుకున్న సదరు పార్టీ తమ పార్టీలో ఉన్న రాష్ట్రస్థాయి నేతల నుంచి వార్డు స్థాయి మెంబర్ దాకా అందరికీ ఈ పట్టభద్రుల వివరాలు సేకరించే బాధ్యతని అప్పజెప్పింది. దాని ప్రకారం పార్టీ వాళ్లే తమ తమ పరిధిలో ఉన్న పట్టభద్రుల వివరాలను సేకరిస్తున్నారు.

ఫిజికల్ గా ఒక ఫారం ఫిల్ అప్ చేసి ఆ వివరాలను తామే ఎన్నికల సంఘం వెబ్ సైట్ ఊ అప్లోడ్ చేసి తామే ఓటు పుట్టిస్తా మని, కానీ అందుకు ప్రతిఫలంగా మీరు తమ పార్టీకే ఓటు వేయాల్సి ఉంది అని షరతు పెడుతున్నాయి. అంతేకాదు వివరాలు తీసుకుంటున్న సమయంలోనే వారి బ్యాంకు ఖాతాల వివరాలు కూడా తీసుకుంటున్నాయి. ఎంత వేస్తాము అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేక పోతున్నా మిమ్మల్ని నిరాశ పరిచే అమౌంట్ అయితే వేయమని అంతకన్నా ఎక్కువే వేస్తామని చెబుతున్నారట.

ఓటు నమోదు చేసుకోవడం కూడా బద్ధకంగా ఫీలయ్యే జనాలు ఇదేదో బానే ఉంది కదా వివరాలు ఇస్తే వాళ్ళు ఓటు క్రియేట్ చేసి ఇస్తారు, పైగా ఓటు వేసినందుకు ఇంకొంత ఇస్తామంటున్నారు అని వాళ్లకు వివరాలన్నీ ఇచ్చేస్తున్నారట. ఓటు పుట్టించు కోవడానికి కూడా ఇంత బద్ధకంగా ఫీలయ్యే వాళ్ళు రేపు ఏదైనా సమస్య వస్తే తాము ఓటు వేసిన నాయకులైనా ప్రశ్నించగలరా అనేది ఆలోచించుకోవాల్సిన విషయం.