తెలంగాణ వ్యాప్తంగా గత మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం రోజున హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే మరో మూడ్రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.
వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఆవర్తన ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని.. బుధవారం నాటికి ఇది దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని దీని కారణంగా మరింతగా వానలు కురుస్తాయని సూచించింది.