అలా మాట్లాడే వాళ్లను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి : కిషన్ రెడ్డి

-

పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక పూర్తి అవుతుందని.. వచ్చే వారంలోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశముందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. 28న అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్  పై బీజేపీ సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్ పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేయడం పై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేదన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లను దోపిడీ దొంగల పార్టీలుగా అభివర్ణించిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దోషులకు శిక్ష పడుతుందనే విశ్వాసం ప్రజలకు లేదన్నారు. బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ బయటికి తీస్తుందని ఆశిస్తే.. అది భంగపడ్డట్టే అవుతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్గిలాంటి పార్టీ అని.. బీజేపీపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్-బీజేపీ ఒక్కటే అని మాట్లాడే వాళ్లను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version