తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటోంది. ఓవైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ముమ్మరం అవుతోంది. ఈనెల 10వ తేదీన నామపత్రాల స్వీకరణ ముగియగా.. ఆ తర్వాత నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది.
తెలంగాణ శాసనసభ ఎన్నికల పోటీలో నికరంగా మిగిలే అభ్యర్థులు జాబితా నేడు ఖరారు కానుంది. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుండటంతో ఈ నెల 30వ తేదీన ఎన్నికల పోలింగ్ బరిలో నిలిచేదెవరో తేలిపోనుంది. నామపత్రాల పత్రాల పరిశీలన అనంతరం 2వేల 898 మంది అభ్యర్థులు మిగిలినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈరోజు మధ్యాహ్నం 3 గంటల అనంతరం మిగిలిన అభ్యర్థలకు నిబంధనల మేరకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయిస్తారు. గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులకు వరుస క్రమంలో జాబితా తయారు చేస్తారు. వాటి ఆధారంగా బ్యాలెట్ రూపొందించి పోలింగ్ నిర్వహిస్తారు.