ఇంకా కొలిక్కి రాని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల వివరాలు

-

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల (Government job vacancies) వివరాలు ఇంకా కొలిక్కి రాలేదు. బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో అన్ని శాఖల కార్యదర్శులు, వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగుల వివరాలను ఖాళీల వివరాలను కేబినెట్ కు అందించారు. ప్రతి విభాగంలో మంజూరు అయివున్న పోస్టుల సంఖ్యను, వివిధ కేటగిరీల్లో ఉన్న ఖాళీల వివరాలతో పాటు అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను సమర్పించారు.అయితే అధికారులు సమర్పించిన నివేదికపై మంత్రి మండలి సంతృప్తి చెందలేదు.

కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారంగా అన్ని రకాల ఉద్యోగుల విభజన జరగాలని, తద్వారా జిల్లాల వారీగా జోన్ల వారీగా అన్ని ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటు చేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన అవసరమని అందుకు సరికొత్త పోస్టుల అవసరం పడుతున్నదని కేబినెట్ అభిప్రాయపడింది. అదే సందర్భంలో కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా పోతున్నదని, కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో కూడా మార్పులు చోటు చేసుకోవాలని సూచించింది.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన దాదాపు పూర్తయిందని, ఆంధ్రాలో మిగిలిపోయిన 200 నుంచి 300 ఉద్యోగులను త్వరలోనే తెలంగాణకు తీసుకురాబోతున్నామన్నది. ఈ అన్ని సందర్భాలను దృష్టిలో ఉంచుకుని, ఇంకా మిగిలివున్న ఖాళీలను సత్వరమే గుర్తించి కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందచేయాలని, మంత్రి మండలి అధికారులను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను క్రోడీకరించి జిల్లాల వారీగా, విభాగాల వారీగా సంకలనం చేయాలని కూడా కేబినెట్ ఆదేశించింది. ప్రస్థుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీల సంఖ్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అన్ని విభాగాల నుంచి 5 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news