కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలపై పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం మరికొన్ని సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సాగుభూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు, భూసమస్యల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు-సంయుక్త సబ్ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే రిజిస్ట్రేషన్ల సేవలకే వారి సమయం గడిచిపోతుండటంతో భూ సమస్యలు, ఇతర ప్రొటోకాల్ సేవల పరిశీలన పనులు భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో మండలస్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించి కార్యాలయ నిర్వహణ, సమస్యల పరిష్కారం తహసీల్దార్లకు కేటాయించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇది అమలైతే తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి లాగిన్‌ను డిప్యూటీ తహసీల్దార్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విధానాన్ని కొన్ని జిల్లాల్లో… పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.