అమలుకు నోచుకోని ఆదేశాలు…హైకోర్టు అసంతృప్తి

-

కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ చర్యలపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి నివేదికను ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) హైకోర్టుకు సమర్పించారు. ఈ నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

 

గతంలో తాము ఇచ్చిన ఆదేశాల్లో కొన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించడంతో పాటు మరికొన్ని ఆదేశాలకు సంబంధించి నివేదికలో ఎలాంటి వివరాలు లేవని పేర్కొంది. అలానే విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సల ధరలు సమానంగా ఉండాలన్న ఆదేశాలు అమలు చేశారా? అని ప్రశ్నించింది. అలానే కరోనాపై సలహా కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించిన ధర్మాసనం కొత్త ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు ఇంకెప్పుడు అందుబాటులోకి వస్తాయో చెప్పాలంది.

ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఇక కరోనా మూడో దశ సన్నద్ధతపై వివరాలు సమగ్రంగా లేవని కూడా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో ఒకే జిల్లాలో 8వేల మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారని గుర్తు చేస్తూ.. అన్నీ భవిష్యత్‌లోనే చేస్తారా? ఇప్పుడేమీ చేయడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక రాష్ట్రానికి కేటాయించిన బ్లాక్ ఫంగస్ ఔషధాలను ఇంకా ఎందుకు సరఫరా చేయలేదో తెలపాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news