కేసీఆర్ స‌ర్కార్ పుట్టగ‌తులు లేకుండా పోవ‌డం ఖాయం – విజ‌య‌శాంతి

సీఎం కేసీఆర్‌ పై మరోసారి విరుచుకుపడ్డారు విజయశాంతి. తెలంగాణ‌లో గిరిజన బిడ్డ‌లు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నరు. వానా కాలం షురూ కావడంతో అడవి బిడ్డలు జ్వరాలతో మంచం పట్టారు. మలేరియా, వైరల్ ​ఫీవర్లతో వణికిపోతున్నరు. వీరికి వైద్యం అంతంతమాత్రంగానే అందుతోంది. అటవీ ప్రాంతాల నుంచి దవాఖానాలకు వెళ్దామంటే రోడ్డు సౌకర్యం లేక మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. వాగులు, వంకలు అడ్డం వస్తుండడంతో తోటి గిరిజనులే కావడి కట్టి తీసుకుపోవడం, మంచాలపై వేసుకుని దాటించడం చేస్తున్నారన్నారు.

రోడ్డు సౌకర్యం ఉన్నచోట్ల అంబులెన్స్​లు టైంకు రాక మధ్యలోనే చనిపోతున్నరు. ఒకవేళ అదృష్టం మంచిగుండి హాస్పిటల్​ వరకూ వెళ్లినా సిబ్బంది, డాక్టర్ల కొరత, సౌలతులు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నయి. పాములు, తేళ్లు వంటివి కుట్టి దవాఖానాల బాట పడితే అక్కడ విరుగుడు మందుల్లేక కాటికి పోతున్నరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసినా జ్వరాలతో బాధపడుతున్నవారే కనిపిస్తున్నరు. ఎక్కువ మంది వైరల్ ​ఫీవర్, మలేరియా బారిన పడేవారే ఉంటున్నరు. జిల్లాలో 29 పీహెచ్​సీలు,15 రౌండ్ ది ​క్లాక్​ పీహెచ్​సీలు, 240 సబ్​సెంటర్లున్నా అన్ని చోట్లా సిబ్బంది కొరత వేధిస్తున్నదని పేర్కొన్నారు.

ప్రతి సబ్​సెంటర్​కు రోజూ 10 నుంచి 15 మంది జ్వరాలతో క్యూ కడుతున్నరు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని 24 గంటల దవాఖానాలో ఇద్దరు డాక్టర్లకు ఒక్కరే ఉన్నరు. ఈయన కూడా మీటింగులనీ… ఇతర పనులనీ అందుబాటులో ఉండడు. ఈ ఒక్క జిల్లానే కాదు. జయశంకర్‌‌ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్​, జిల్లాల్లోని ఎజెన్సీ ప్రాంతాల గిరిజ‌నుల ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. వారికి సాధార‌ణ జ్వ‌రం వచ్చినా ఒక్క మందు బిళ్ల కూడా అందుబాటులో ఉండ‌డం లేదు. జ్వ‌రానికి కూడా మందులు ఇవ్వ‌లేని స‌ర్కార్ ఉంటే ఎంత లేకుంటే ఎంత‌? దీనికి నీ జవాబేంటి కేసీఆర్? బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ఇప్ప‌టికైనా గిరిజ‌న బిడ్డ‌ల‌కు స‌రియైన వైద్యం అందించు. అమాయక ఆడ‌వి బిడ్డ‌ల ప్రాణాల‌తో ఆట‌లాడుతున్న కేసీఆర్ స‌ర్కార్ పుట్టగ‌తులు లేకుండా పోవ‌డం ఖాయమని హెచ్చరించారు విజ‌య‌శాంతి.