ఔటర్ రింగ్ రోడ్ ( ఓఆర్ఆర్) టెండర్ వివాదంపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్ వివాదం పై మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన సమాధానం చెప్పలేకనే అధికారులతో మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. ఓఆర్ఆర్ పై అప్పుల భారం లేదని.. అలాంటప్పుడు ప్రైవేట్ కి ఎందుకు అప్పగిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుహరిస్తున్న విధానం లాగే.. రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు.
ఓఆర్ఆర్ పై అరవింద్ కుమార్ వివరణ సంతృప్తిగా లేదని పేర్కొన్నారు. ప్రముఖ సంస్థ నివేదిక ఆధారంగా టెండర్ పిలిచామని చెప్పారని.. నివేదిక ఇచ్చిన సదరు సంస్థ చరిత్ర సక్రమంగా లేదని వెల్లడించారు రేవంత్ రెడ్డి. తమకు సమాధానం చెప్పకపోయినా సిబిఐ, ఈడికి అరవింద్ కుమార్ సమాధానం చెప్పవలసి వస్తుందన్నారు. గతంలో ఇదే తరహాలో వ్యవహరించిన బీపీ ఆచార్య, శ్రీ లక్ష్మీ వంటి అధికారులకు ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.