ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 7 కు వాయిదా వేసింది. నిందితులకు ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకునే స్వేచ్ఛ ఉందని కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులోనూ విచారణ జరిగింది.ఈ కేసులో విచారణను హైకోర్టు.. సోమవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు దర్యాప్తుపై స్టే కొనసాగుతుందని పేర్కొంది.
భాజపాతోపాటు.. నిందితుడు నందు భార్య చిత్రలేఖ, ఇతర పిటిషన్లను కలిపి హైకోర్టు.. సోమవారం విచారించనుంది. కేసును సీబీఐ లేదా.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గతవారం.. ఆ పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంతవరకు మెయినాబాద్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తుపై స్టే విధించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు నిన్న కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్ సుదీర్ఘంగా ఉన్నందున వాదనకు సమయమివ్వామని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా సోమవారానికి విచారణ వాయిదా వేసింది.