జగన్ని ఏ విధంగా దెబ్బకొట్టాలి..ఆయన్ని వచ్చే ఎన్నికల్లో ఎలా అధికారంలోకి నుంచి దించేయాలనే దిశగానే ప్రతిపక్ష టీడీపీ ముందుకెళుతుంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా టీడీపీ వదులుకోవడం లేదు. ఇప్పటికే అనేక రకాలుగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలని తప్పుబడుతూ పోరాటాలు చేసింది. అలాగే జగన్ పై అన్నీ విధాలుగా నెగిటివ్ వచ్చేలా చేయడానికి ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో ముందుకొస్తూనే ఉంది.
కేవలం టీడీపీ మాత్రమే జగన్ పై విమర్శలు చేస్తే..అది జనాలు నమ్మడానికి తక్కువ అవకాశం ఉంటుంది..అందుకే రాష్ట్రంలో మిగిలిన పార్టీలు కూడా టార్గెట్ చేస్తే..అప్పుడు జగన్ ప్రభుత్వం తప్పులు చేస్తున్నది అనే భావన ప్రజల్లో వస్తుంది. ఆ దిశగానే టీడీపీ పనిచేస్తుంది. తాజాగా విజయవాడలో సేవ్ డెమోక్రసీ పేరుతో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఐ..ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. ఒక్క ఛాన్స్ అడిగి అధికారంలోకి వచ్చిన జగన్ అన్నీ వ్యవస్థలని నాశనం చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీలతో సంబంధం లేకుండా అంతా ఏకం కావాలని, పార్టీలు, అభిప్రాయాలు వేరైనా రాష్ట్ర భవిష్యత్ కోసం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. హత్య చేసిన మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వారికి సన్మానామా అని సిపిఐ నేత రామకృష్ణ ఫైర్ అయ్యారు. అధికార పార్టీకి పోలీసులు లొంగిపోయి వ్యవస్థ పరువు తీస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వా ప్రేరేపిత ఉగ్రవాదం విచ్చలవిడిగా మారిందని జనసేన నేత కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. ఇలా అన్నీ పార్టీల నేతలు..జగన్ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఈ ఆల్ పార్టీ మీటింగ్ ద్వారా..జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.