జమ్మూకాశ్మీర్ లోని రియాసిలో ఆర్మీ, పారామిటరీ బలగాల ఆధ్వర్యంలో సెర్చ్ ఆపరేషన్ నిన్నటి నుంచి కొనసాగిస్తున్నాయి. ఆదివారం రియాసిలో ఉగ్రవాదులు యాత్రికుల బస్సును టార్గెట్ చేసుకుని కాల్పులకు తెగబడిన విషయం విదితమే. దీంతో ఆ వాహనం అదుపు తప్పి, పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా.. 33 మంది స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే కాల్పుల నేపథ్యంలో టెర్రరిస్టులను మట్టికరిపించేందుకు భద్రతా బలగాలు ఉగ్రవేట కొనసాగిస్తున్నాయి. పూంచ్, రాజోరి, రియాసి లోని ఎగువ ప్రాంతాల్లో నక్కిన ఉగ్రవాదులే కాల్పులకు బరితెగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక అటవీ ప్రాంతం డ్రోన్లు, హెలికాప్టర్ ద్వారా జల్లెడ పడుతున్నారు. కాగా, రియాసి ఉగ్రదాడిలో మరణించిన వారికి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఇవాళ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతులకు రూ. పది లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు-ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.