సోషల్ మీడియా వచ్చాక జనాలు ఇళ్లళ్లో కంటే..రోడ్లమీదే ఎక్కువగా ఉంటున్నారు. రీల్స్‌లో చూడండి.. అన్నీ బయటచేసేవే ఉంటాయి.. అలా చేయడం కూడా పెద్దగా తప్పేం కాదు.. పబ్లిక్‌కు ఇబ్బంది కలిగించనంత వరకూ చేసుకోవచ్చు..ఇవి మన దగ్గర రూల్స్.. కానీ కఠినమైన చట్టాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఇరాన్‌లో ప్రతీది తప్పే.. బహిరంగ ప్రదేశంలో డ్యాన్స్ వేశారని ఓ జంటకు ఏకంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది ఇరాన్ ప్రభుత్వం..
ఇరాన్‌లో ప్రస్తుతం పౌరులపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ ఆంక్షలను ఉల్లంఘించిన వారికి అత్యంత కఠిన శిక్షలను విధిస్తున్నారు. ఇరాన్‌లో అమలవుతున్న కఠిన నిబంధలనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది.. మహిళలు కచ్చితంగా హిజాబ్ ధరించాలన్న నిబంధనను, విద్యా సంస్థల్లో మహిళల ప్రవేశానికి సంబంధించిన ఆంక్షలను ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు.. ఈ క్రమంలో సుమారు 20 ఏళ్ల వయస్సున్న ఒక యువ జంట రాజ్యం విధించిన అమానవీయ ఆంక్షలకు వ్యతిరేకంగా గత సంవత్సరం నవంబర్‌లో ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఆజాదీ స్క్వేర్ ముందు జంటగా డ్యాన్స్ చేశారు. అస్తియాజ్ అజీజీ (Astiyazh Haghighi), ఆమె ఫియాన్సీ ఆమిర్ మొహమ్మద్ అహ్మది (Amir Mohammad Ahmadi) రొమాంటిక్ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఇరాన్ ప్రజలు బహిరంగంగా డ్యాన్స్ చేయడాన్ని ఒక శక్తిమంతమైన ఆయుధంగా వాడుతున్నారు.
ఆ డ్యాన్స్ చేస్తున్న సమయంలో అస్తియాజ్ అజీజీ హిజాబ్ ధరించలేదు. అంతేకాదు, ఇరాన్‌లో స్త్రీలు బహిరంగంగా డ్యాన్స్ చేయడం నేరం. మగవారితో కలిసి అసలు నాట్యం చేయకూడదు.. దాంతో, ఆ చర్యను రాజ్య ధిక్కరణగా నిర్ధారించిన ఇరాన్ ప్రభుత్వం వారిద్దరిని అరెస్ట్ చేసింది. వారికి బెయిల్ ఇవ్వలేదు. వారి తరఫున వాదించడానికి లాయర్లను అనుమతించలేదు. ఏకపక్ష విచారణ అనంతరం ఇరాన్ రెవొల్యూషనరీ కోర్టు వారికి వేర్వేరుగా 10 సంవత్సరాల ఆరు నెలల జైలుశిక్షను విధించింది. అలాగే, వారు ఇంటర్నెట్‌ను వాడకూడదని నిషేధం విధించింది.
జైలు శిక్ష పడిన అస్తియాజ్ అజీజీ , ఆమె ఫియాన్సీ ఆమిర్ మొహమ్మద్ అహ్మది ఇరాన్‌లో ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ బ్లాగ్సర్స్‌గా చాలా పాపులర్. హిజాబ్ నిబంధనను పాటించని మాసా అమిని అనే యువతి పోలీసుల కస్టడీలో మరణించిన అనంతరం ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు మిన్నంటాయి. ప్రభుత్వం కూడా వాటిని అంతే తీవ్రంగా అణచివేయడం ప్రారంభించింది. ఇప్పటివరకు నిరసనల్లో పాల్గొన్న సుమారు 14 వేల మందిని అరెస్ట్ చేసింది.
ఇరాన్‌లో ఇంత కఠినమైన చట్టాలు పాటించి ఎవర్ని ఉద్దరించాలానో.. మనిషికి స్వేచ్ఛగా బతికే హక్కు లేనప్పుడు ఇంకా ఆ బతుకు ఎందుకు.. బానిస సంకెళ్లు లాంటి చట్టాలను రద్దుచేయనంత కాలం.. ఇరాన్ ప్రజలు ఆ చట్టాల కిందే చిత్తు అయిపోక తప్పదు.. అక్కడి నిబంధనలు, ఆ చట్టాలతో పోల్చుకుంటే..మనం ఎంత స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామో అనిపిస్తుంది కదా.. ఇరాన్ ప్రజలకు ఈ చెత్త చట్టాల నుంచి ఎప్పుడు విముక్తి వస్తుందో అని ఎంతోమంది ఆశగా ఎదురుచూస్తున్నారు.