ఈ నియంతల ఆహారపు అలవాట్లు భలే విచిత్రం! రోజుకు 40 బత్తాయి పండ్లు..

-

ఇప్పుడంటే..ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం వచ్చింది..ఒకప్పుడు అంతా రాజులు, రాచరికాలే కదా.. అయితే ఒకదశలో రాచరికాలు అంతమయ్యాక కొన్నిదేశాలు నియంతల గుప్పిట్లోకి వెళ్లాయి. నియంత అంటే మనకు తెలుసు..ఏం చెప్తే అది చేయాలి..వారి మాటే శాశనం..వినకపోతే నాశనం అన్నట్లు ఉంటారని మనం వినే ఉంటాం. అయితే వాళ్లు వారి వ్యక్తిగత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేవాళ్లట. చరిత్రలో కొందరు నియంతల ఆహారపు అలవాట్లు చూస్తే..మనకు విచిత్రంగా అనిపించటం ఖాయం.

1. అడాల్ఫ్‌ హిట్లర్‌

అడాల్ఫ్‌ హిట్లర్‌ జర్మనీని 1933 నుంచి 1945 మధ్య పరిపాలించిన నియంత. ఆయన శాకాహారి కావడంతో ఎక్కువగా బంగాళదుంపల పులుసుతో భోజనం చేసేవారట. బంగాళదుంపల పులుసుతో తనకున్న దీర్ఘకాలిక అపానవాయువు, మలబద్దకం సమస్యలు తొలగిపోతాయని నమ్మేవారట. హిట్లర్‌ తినడానికి ముందు ఆయనకు పెట్టిన ఆహారాన్ని పరిశీలించడానికి 15 మంది ఫుడ్‌ టెస్టర్లు ఉండేవాళ్లు.. వారంతా ఆహారం తిని 45 నిమిషాల తర్వాత బతికి ఉంటే అప్పుడు హిట్లర్‌ భోజనం చేసేవారట. ఇలాంటి టెస్టింగ్ లు మనం సినిమాల్లో చూస్తుంటాం.

2. కిమ్‌ జోంగ్‌ ఇల్‌

ఉత్తర కొరియాలో పాలన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడు తరాలుగా కిమ్‌ కుటుంబమే ఆ దేశాన్ని ఏలుతోంది. అందులో రెండో తరం వ్యక్తి, దేశ మాజీ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌కు షార్క్‌-ఫిన్ అంటే సొర చేపల రెక్కల సూప్‌, శునకం మాంసంతో చేసిన సూప్‌ అంటే చాలా ఇష్టమట. అవి అతడికి రోగనిరోధకశక్తి, బలాన్ని ఇస్తాయని నమ్మేవాడట.. అంతేకాదండోయ్.. ఆయన తినే ఆహారంలో ఉపయోగించే బియ్యం నాణ్యత, ఆకృతి, రంగును పరిశీలించడానికి పదుల సంఖ్యలో మహిళలతో ఒక బృందం ఉండేదట. మరీ వితంగా అనిపిస్తుంది కదూ..

3. ఈదీ అమీన్‌

ఉగాండా దేశాన్ని పరిపాలించిన సైనిక అధికారి. 1971 నుండి 1979 వరకు ఉగాండా దేశానికి అధ్యక్షునిగా ఈయన వ్యవహరించారు. ప్రపంచంలో అత్యంత కిరాతక నియంతల్లో ఒకడిగా ఈదీ అమీన్ కు పేరుంది. అనేక రాజకీయ పరిణామాల మధ్య అతడిని పదవిని నుంచి దించేయడంతో సౌదీ అరేబియాలో ఆశ్రయం పొందారు. అయితే, సౌదీలో ఉన్ననాళ్లు అమీన్‌ రోజుకు 40 బత్తాయి పండ్లు, కేఎఫ్‌సీ చికెన్‌ బాగా తినేవారట. మధ్యాహ్నం సమయంలో టీ తాగడాన్ని ఇష్టపడతారట. ఇతను..నరమాంసభక్షకుడనే వదంతులు కూడా ఉన్నాయి.

4. జోసెఫ్‌ స్టాలిన్‌

ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌కు ప్రీమియర్‌ జోసెఫ్‌ స్టాలిన్‌. జార్జియాకు చెందిన స్టాలిన్‌ ఆ దేశ సంప్రదాయ వంటకాలంటే బాగా ఇష్టపడేవారు. వాల్‌నట్స్‌, రేగు పండ్లు, దానిమ్మ పండ్లను ఎక్కువగా తినేవారట. ఆయనకు ఆహారం వండిపెట్టే వ్యక్తి ఎవరో ఎవరోకాదు… ప్రస్తుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తాత అయిన స్పిరిడాన్‌ పుతిన్‌. స్టాలిన్‌ కన్నా ముందు సోవియట్‌ను పాలించిన వ్లాదిమిర్‌ లెనిన్‌కు కూడా ఆయన వంట చేసేవారట. స్టాలిన్‌ భోజనం చేసే సమయాన్ని ఎంతో ఇష్టంగా గడుపుతారు. ఆడుతూ.. పాడుతూ.. ఒక్కోసారి ఎనిమిది గంటలు భోజనం చేస్తారట. వినటానికి నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమే.

5. బెనిటో ముస్సోలిని

ఇటలీ మాజీ ప్రధానమంత్రి అయిన బెనిటో అమిలికేర్‌ ఆండ్రియా ముస్సోలిని.. జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించి, నేషనల్‌ ఫాసిస్ట్‌ పార్టీని స్థాపించి.. 1922లో ఆ దేశ ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఆయన నియంతృత్వ పాలనపై వ్యతిరేకత పెరిగింది. దీంతో ఆయన 1943లో గద్దె దిగాల్సి వచ్చింది. ఆయనకు వెల్లుల్లితో చేసిన సలాడ్‌ అంటే చాలా ఇష్టమట. కేవలం వెల్లుల్లిని ముక్కలుగా చేసుకొని వాటిపై నూనె, నిమ్మరసం పోసుకొని తినేసేవారట. వామ్మో ఇది మరీ ఘోరంగా ఉంది కదు.. ఇక భోజనం విషయానికి వస్తే వీలైనంత వరకు తన కుటుంబంతో కలిసి తినడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆయన డైనింగ్‌ టేబుల్‌ వద్దకు వచ్చే సరికి కుటుంబసభ్యులు, వడ్డించే వ్యక్తులు సిద్ధంగా ఉండాలి. భోజనం విషయంలో ముస్సోలిని సమయపాలన, క్రమశిక్షణను కచ్చితంగా పాటించేవారట.

మొత్తానికి వీరి ఆహారపు అలవాట్లు ఇ‌వి..నియంతల పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. అదృష్టవశాత్తూ..ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు..కానీ అధికార పార్టీ నాయకులే…నియంతల్లా వ్యవహరిస్తున్నారని..ఇప్పటికి ప్రతిపక్షాలు అంటుంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version