రెండంతస్థుల భవనాన్ని పునాదులతో సహా లేపి మరో ప్రాంతానికి తరలిస్తున్న యజమాని..

-

చాలామందికి సొంత ఇళ్లు ఉండటం అనేది ఒక పెద్ద కల. అది కలగానే ఎంతోమంది జీవితాల్లో మిగిలిపోతుంది.ఎలాగోలా కష్టపడి ఇళ్లు కట్టామంటే.. ప్రభుత్వాలు రోడ్డు విస్తరణ పేరుతో వారి అవసరాలకు తగ్గట్టుగా తొలగిస్తూ వస్తున్నాయి. నేడు చాలా చోట్ల రోడ్డుపక్కన ఉన్న ఇళ్లకు ఇదే ప్రమాదం పొంచి ఉంది. ఎంతోకొంత పరిహారం ఇచ్చి అడ్డుగా ఉన్నవాటిని కూలుస్తారు. పంజాబ్‌లో కూడా ఇలానే జరిగింది. కానీ ఆ రైతు తన ఇంటిని కూల్చేందుకు ఇష్టపడలేదు. పరిహారానికి ఒప్పుకోలేదు..తానే తన ఇంటిని వెనక్కు జరుపుకుంటానని చెప్పాడు. అధికారులు ఆశ్చర్యపోయారు.. అసలేం చేశారంటే..

పంజాబ్ రాష్ట్రంలోని సంగ్ రూర్ జిల్లాకు చెందిన రైతు.. సుఖ్ విందర్ సింగ్ ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇంటిని కూల్చడం ఇష్టం లేక.. అక్కడి నుంచి పక్కకు తరలించే ప్రయత్నం చేస్తున్నాడు. రోషన్ వాలా గ్రామంలోని తన స్థలంలో ఆయన తన డ్రీమ్ హౌస్‌ను కట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఇల్లు కట్టుకున్న స్థలం మీదుగా ఎక్స్‌ప్రెస్‌ వేను నిర్మిస్తుంది కేంద్ర ప్రభుత్వం. భారత్‌ మాల ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే భూ సేకరణ చేసింది. రహదారికి అడ్డుగా ఉన్న సుఖ్‌ విందర్‌ సింగ్‌ ఇంటిని కూల్చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నష్టపరిహారం కూడా అందించింది. అయితే.. ఆ రైతుకు మాత్రం ఆ ఇంటిని కూల్చడం అస్సలు ఇష్టం లేదు. ఎలాగైనా తన డ్రీమ్ హౌస్‌ను కాపాడుకోవాలి అనుకున్నాడు. పునాదులతో సహా ఆ ఇంటిని మరో చోటుకు తీసుకెళ్లాలాని ఫిక్స్‌ అయ్యాడు.

అంతే అనుకున్నదే తడవుగా భవన నిర్మాణ కార్మికులను, ఇంజినీర్లను తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తన ఇంటిని సుమారు 500 అడుగుల దూరం తరలించాలని చెప్పాడు. ఆయన కోరిక మేరకు పునాదుల దగ్గర నుంచి ఇంటిని అమాంతం జాకీలతో పైకి లేపారు. భవనాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చక్రాల్లాంటి కదిలే గేర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారు 250 అడుగుల వరకు ఇంటిని తరలించారు.

కొద్దిరోజుల్లో గమ్యానికి చేరనున్న ఇళ్లు..

ఈ ఇంటిని నిర్మించేందుకు సుమారు కోటిన్నర రూపాయలను ఖర్చు చేసినట్లు సుఖ్‌ విందర్‌ సింగ్‌ వెల్లడించారు. దీని నిర్మాణానికి రెండేళ్లకు పైగా సమయం పట్టిందట. ఎన్నో వ్యయ ప్రయాసలను అధిగమించి.. కట్టుకున్న కలల ఇంటిని కూల్చేయడానికి మనసొప్పలేదు. అందుకే ఎంత కష్టం అయినా ఈ ఇంటిని కాపాడుకునేందకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఇంటిని తరలిస్తున్నట్లు వెల్లడించాడు ఆ రైతు.. మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా తరలిస్తారని తెలిపారు.

ఇప్పుడున్న టెక్నాలజీతో ఇలా చాలామంది చేస్తున్నారు. ఆంధ్రాలో కూడా రహదారి ఎత్తులెగడంతో ఓ యజమాని తన ఇంటిని కూడా పునాదులతో సహా ఎత్తు లేపారు. అంతే కాదు.. ఈసారి వాస్తు దృష్ట్యా కావాల్సిన యాంగిల్‌లో ఇంటిని ప్లేస్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news