దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిధితుడుగా ఉన్న దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. శివశంకర్ రెడ్డి బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. బెయిల్ ను నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ హత్యకు గల కారణం వైసిపి రాష్ట్ర కార్యదర్శి దేవీ రెడ్డి శంకర్ రెడ్డేనని సిబిఐ అధికారులు, వైయస్ వివేకా కుమార్తె సునిత ఆరోపిస్తున్నారు.
వైయస్ వివేకా హత్య ప్రణాళిక నుంచి ఆధారాలను ధ్వంసం చేయడం వరకు శివశంకర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని సునీత తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ మంజూరు చేయవద్దని హైకోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.