ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు చాలా డేంజర్ : సుప్రీం కోర్టు

-

ఎన్నికల సమయంలో ఓట్లు కొల్లగొట్టడానికి రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వడం పరిపాటే. అయితే ఇలా అసంబద్ధమైన హామీలు ఇవ్వడం తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం ఎందుకు సంకోచిస్తోందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.


ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలను నియంత్రించలేమని ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో ఆర్థిక సంఘం అభిప్రాయాన్ని తీసుకోవచ్చా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో ఉచిత హామీలు ఇస్తుండడానికి వ్యతిరేకంగా న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఇలాంటి హామీలు ఇచ్చే పార్టీల చిహ్నాలను స్తంభింపజేసి, నమోదును రద్దు చేసేందుకు ఉన్న అధికారాలను ఈసీ వాడేలా చూడాలని పిటిషనర్‌ కోరారు.

మరో కేసు విషయంలో కోర్టుకు వచ్చిన సీనియర్‌ న్యాయవాది, ఎంపీ కపిల్‌ సిబల్‌ అభిప్రాయాన్ని ధర్మాసనం తెలుసుకోగోరింది. ఉచితాలు నిజంగా తీవ్రమైన అంశమనీ, పరిష్కారాలు చాలా కష్టమని సిబల్‌ అభిప్రాయపడ్డారు.

‘ఈ విషయంలో మీరు చేసేదేమీ లేదనీ, ఈసీ ఒక నిర్ణయం తీసుకోవాలని ఎందుకు చెప్పరు? అసలు కేంద్ర ప్రభుత్వం దీనిని తీవ్రమైన విషయంగా పరిగణిస్తోందా, లేదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరొక నిర్ణయం తీసుకోండి. అప్పుడు ఈ ఉచితాలు కొనసాగాలా, వద్దా అనేది మేం నిర్ణయిస్తాం. దీనిపై సవివరంగా ప్రమాణపత్రం దాఖలు చేయండి’ అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ను సీజేఐ ధర్మాసనం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news