అందరూ అనుకున్నట్టుగానే ఈటల రాజేందర్ ఈ రోజు తన పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా షామీర్‌పేటలోని తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విషయాలు వెల్లడించారు. కేసీఆర్‌పై ఎన్నో విమర్శలు చేశారు. టీఆర్ ఎస్‌లో ఉద్యమకారులకు ఎప్పుడూ గౌరవం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్‌తో ఐదేళ్ల క్రితమే గ్యాప్ వచ్చిందని, మంత్రి పదవిలో ఉన్నంత మాత్రానా అణిగిమణిగి ఉండే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తన ఆత్మగౌరవ బావుటా కేసీఆర్‌కు నచ్చలేదని, అందుకే ఇంత దారుణానికి పాల్పడ్డాడని ఆరోపించారు.
ఇక టీఆర్ ఎస్‌లో మంత్రి హరీశ్‌రావుకు కూడా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని, అయినా తాము రాష్ట్రం కోసమే పనిచేశామంటూ చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా ఎన్నోసార్లు అవకాశం ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ను కలవడానికి ఎమ్మెల్యేలం అందరం కలిసి వెళ్తే గేట్ దగ్గరే ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో సారి అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్లాల్సి వచ్చేదన్నారు. మూడోసారి అలాగే జరిగితే కోపంగా వెళ్లి గోళీలు ఇచ్చే ఎంపీ సంతోష్‌ను ప్రశ్నించానని, అది ప్రగతి భవన్ కాదు.. బానిస భవన్ అని పేరు పెట్టుకోవాలని తేల్చి చెప్పినట్టు వెల్లడించారు.