నిత్యం యోగా చేయడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మనకు కలిగే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుంది. అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అలాగే ఇంకా ఎన్నో లాభాలు మనకు యోగా చేయడం వల్ల కలుగుతాయి. అయితే యోగా చేయాలనుకునే వారు ఆరంభంలో పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. అవేమిటంటే…
1. యోగా చేయాలనుకునే వారు యోగా ఎందుకు చేయాలనుకుంటున్నారో ముందుగా ఒక నిర్ణయానికి రావాలి. ఏ అనారోగ్య సమస్య లేని వారు అవి రాకుండా ఉండాలని యోగా చేయాలి. ఇక సమస్యలు ఉన్నవారు ఆయా సమస్యల నుంచి బయట పడేందుకు యోగా చేయాలి. ఈ విషయంలో స్పష్టత ఉండాలి. లేదంటే మనం యోగా ఎందుకు చేస్తున్నామో తెలియదు. దాని ఫలితం కూడా ఎలా ఉంటుందో మనకు తెలియదు. కనుక యోగా చేసేవారు యోగా ఎందుకు చేస్తున్నారో ముందుగానే ఓ క్లారిటీకి వస్తే మంచిది.
2. యోగాసనాలను ఎప్పుడు పడితే అప్పుడు.. ఎలా పడితే అలా చేయరాదు. అందుకు సమయం ఉంటుంది. భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు యోగా చేయాలి. మిగిలిన సమయాల్లో చేసే యోగాసనాలు కూడా వేరుగా ఉంటాయి. వాటి గురించి ముందుగా తెలుసుకోవాలి. అవసరం అయితే యోగా గురువులను సంప్రదించవచ్చు. లేదా ఆన్లైన్ లో చూసి నేర్చుకోవచ్చు.
3. యోగా చేసే వారు నేరుగా నేలపై చేయకూడదు. యోగా మ్యాట్ లేదా వస్త్రం వేసుకుని దానిపై యోగా చేయాలి.
4. యోగా చేసే వారు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. మహిళలు లెగ్గింగ్స్, పురుషులు షార్ట్స్ ధరిస్తే మంచిది.
5. యోగా చేయాలనుకునే వారు నిత్యం పోషకాహారం కూడా తీసుకుంటే ఇంకా ఎంతో మేలు కలుగుతుంది.
6. యోగాతోపాటు మెడిటేషన్, శ్వాస వ్యాయామాలు చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
7. యోగా చేయాలనుకునే వారు ఒకేసారి కఠినతరమైన ఆసనాలు వేయరాదు. సులభమైన ఆసనాలతో మొదలు పెట్టి కఠినతరమైన ఆసనాలకు వెళ్లాలి. ఇందుకు చాలా మందికి అధిక సమయం పడుతుంది. అయినా సరే.. యోగాను నెమ్మదిగా నేర్చుకోవాలి. అలాగే ఏ ఆసనాన్నయినా పరిమితికి మించి వేయరాదు. సాధారణంగా ఒక్క ఆసనం వేసేందుకు 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుంది. అయితే ప్రాక్టీస్ ఉంటే ఏ ఆసనాన్నయినా ఎన్ని సార్లయినా వేయవచ్చు. ప్రాక్టీస్ లేకుండా ఆసనాలను ఎక్కువ సార్లు వేయకూడదు.
8. యోగా చేస్తున్న సమయంలో చుట్టూ ఎలాంటి శబ్దాలు లేకుండా.. ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ప్రకృతిలో వ్యాయామం చేస్తే ఇంకా మంచిది.
9. ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యలో యోగా చేస్తే ఇంకా మంచిది. దాంతో ఫలితం ఎక్కువగా ఉంటుంది.
10. మనకు వేసేందుకు అనేక యోగాసనాలు అందుబాటులో ఉన్నా అందరూ అన్ని ఆసనాలను వేయలేరు. అది కేవలం యోగాను బాగా సాధన చేసేవారికే సాధ్యమవుతుంది. అందువల్ల ఆ స్థాయికి చేరుకోవాలంటే.. నిత్యం యోగా చేయాలి. దాన్ని కొన్ని సంవత్సరాల పాటు అలాగే కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడే ఎవరైనా అన్ని యోగాసనాలను వేయగలరు.