తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో వాహనంపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. వాహన సేవలో మలయప్పస్వామిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడి దర్శనంతో పూర్ణ ఫలం దక్కుతుందనేది భక్తుల నమ్మకం. ఈ వాహనసేవను తిలకిస్తే ఆరోగ్యం, ఐశ్వర్య భాగ్యం కలుగుతాయనేది వారి విశ్వాసం.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కరోనా వల్ల రెండేళ్లు నిరాడంబరంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులంతా ప్రశాంతంగా స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు.