పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాలు జరగుతున్న టైంలో ప్రతీ మంగళవారం ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని బీజేపీ నిర్వహిస్తుంది. కాగా, ఈనెల 13వరకు ఈ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. ఇదిలా ఉంటే.. ‘అదానీ’ వ్యవహారంపై పార్లమెంట్ వరుసగా మూడోరోజు స్తంభించింది. అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ వెల్లడించిన నివేదికపై ఉభయ సభల్లో విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.
సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంటు చర్చకు అనుమతి లభించకపోవడంతో విపక్ష పార్టీల నేతలు పార్లమెంటు వెలుపల నిరసన తెలిపాయి. బీఆర్ఎస్ పార్లమెంటరి పార్టీ నేత కె.కేశవరావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అదానీ వ్యవహారంపై చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నుంచి పారిపోయిందని విమర్శించారు. మూడో రోజులుగా చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇస్తున్నా చర్చ జరపడం లేదని అన్నారు. రూల్ 267 కింద మూడు రోజులుగా నోటీసు ఇచ్చామని తెలిపారు.