ఆంధ్రావనిలో ప్రస్తుతం ఉద్యోగ,నిరుద్యోగ సమస్యలపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. అధికారంలోకి వచ్చాక తాము నిరుద్యోగ సమస్యలు తీరుస్తామని ఆ రోజు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ మాటనే మరిచారు అంటూ జనసేనాని పవన్ ఆవేదన చెందారు.ఈ నేపథ్యంలో ఆయనేమన్నారంటే..అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో సహా జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా…ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు,పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తాను అంటూ ముద్దులుపెట్టి మరీ!చెప్పారు.
మెగా డీఎస్సీ లేదు.పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు.గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదు.పరిపాలనలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10 వేల ఉద్యోగాలతో క్యాలెండర్ వేశారు…అవి ఇప్పటికీ భర్తీ కాలేదు.నిరాశ,నిస్పృహలతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారు.అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని నెరవేర్చడం మరచిపోయారు. మాకు ఉద్యోగాలు ఏవి అని కలెక్టరేట్ల దగ్గరకు వెళ్ళి యువత అడిగితే లాఠీ ఛార్జీలు చేయించి అరెస్టులు చేస్తున్నారు.
రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ అనేది ఈ ప్రభుత్వం దగ్గర ఉందా? నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కోసం ముఖ్యమంత్రి ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారు…వాటిలో నిర్ణయాలు ఏమిటి? అమలు ఎంత వరకూ వచ్చిందో యువతకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.మెగా డీఎస్సీ ప్రకటన ఎప్పుడు చేస్తారు… 6వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియచేయాలి.