డబ్బుల్లేని కారణంగానే విద్యుత్ సంక్షోభం అని తేలిపోయింది. కానీ ఇదేమీ బయటకు చెప్పకుండా విద్యుత్ కొందామన్నా దొరకని కారణంగానే అవస్థలుపడుతున్నామని సర్కారు చెబుతోంది. రోజుకు 55 మిలియన్ యూనిట్ల కొరత ఉంది కనుక దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కానీ అందుకు తగ్గ మొత్తం మనోళ్ల దగ్గర లేదని తెలుస్తోంది. పీక్ అవర్స్ లో విద్యుత్ యూనిట్ ధర పన్నెడు రూపాయలకు పైగా పలుకుతోంది. కానీ అధికారులు తక్కువ ధరకు కోట్ చేసి తరువాత తప్పుకుంటున్నారని ప్రధాన మీడియా అందించే వార్తలు వివరిస్తున్నాయి.
ఆంధ్రావనిలో విద్యుత్ సంక్షోభం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. వేళ కాని వేళ్లలో విద్యుత్ కోతల కారణంగా విద్యార్థులు, మహిళలు, చిన్నారులు నానా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ కొనుగోలు చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నా బహిరంగ మార్కెట్లో లభ్యం కావడం లేదని సంబంధిత అధికారులు చెబుతుండడం హాస్యాస్పదం అని కూడా తేలిపోయింది. పొరుగున ఉన్న తెలంగాణ తమ ప్రాంతానికి సంబంధించి ఉన్న లోటును భర్తీ చేసేందుకు 90 మిలియన్ యూనిట్లు ఎక్స్ఛేంజీ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకు వందకోట్ల రూపాయలు వెచ్చిస్తోంది.
కానీ మన ప్రభుత్వం మాత్రం అస్సలు విద్యుత్ దొరకడమే లేదని అంటోంది. అంటే సంక్షోభ నివారణలో ఆంధ్రా కన్నా తెలంగాణ తీసుకుంటున్న చర్యలో సత్ఫలితాలు ఇస్తున్నాయని అర్థం చేసుకోవాలి. అయితే పీక్ అవర్స్ లో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి మన అధికారులు చూపుతున్న శ్రద్ధ అరకొరగానే ఉంది అని తేలిపోయింది. అంటే పీక్ అవర్స్ లో (ఉదయం ఆరు నుంచి పది గంటలు, అదేవిధంగా సాయంత్రం ఆరు నుంచి పది గంటలు ) విద్యుత్ కొనుగోలు పోటీ ఉన్నా ఎక్కువకు కోట్ చేసి కొనుగోలు చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించిన రాష్ట్రాలు ఉన్నాయి కానీ మన సర్కారు మాత్రం ఆ పాటి చొరవ కూడా చూపడం లేదు అన్న వాదన బలీయంగా వినిపిస్తోంది.