చేవెళ్ళ పోరు..త్రిముఖమే..పైచేయి ఎవరిది?

-

తెలంగాణలో ఆసక్తి పోరు జరిగే ప్రాంతాల్లో చేవెళ్ళ పార్లమెంట్ స్థానం కూడా ఒకటి. అటు తెలంగాణ ప్రాంత ప్రజలు…ఇటు ఏపీ నుంచి వచ్చి సెటిలైన వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగానే మారుతుంది. అయితే గత ఎన్నికల్లో చేవెళ్ళ పరిధిలో బి‌ఆర్‌ఎస్ పార్టీ పై చేయి సాధించింది. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు స్థానాలు ఉన్నాయి. మహేశ్వరం, తాండూరుల్లో కాంగ్రెస్ గెలవగా, మిగిలిన స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ గెలిచింది. కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు బి‌ఆర్‌ఎస్ వైపుకు వెళ్లారు. దీంతో చేవెళ్ళ మొత్తం బి‌ఆర్‌ఎస్ చేతుల్లోకి వచ్చింది. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సీన్ మారింది. చేవెళ్ళ ఎంపీ సీటుని కేవలం 1300 ఓట్ల తేడాతో బి‌ఆర్‌ఎస్ గెలుచుకుంది. బి‌ఆర్‌ఎస్ తరుపున పోటీ చేసి రంజిత్ రెడ్డి గెలిచారు. కాంగ్రెస్ తరుపున కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.

అయితే పార్లమెంట్ ఎన్నికల్లో రాజేందర్ నగర్, శేరిలింగంపల్లి స్థానాల్లోనే బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఆధిక్యం రాగా, మహేశ్వరం, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వచ్చింది. అయితే బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఆ రెండు స్థానాల్లో ఎక్కువ మెజారిటీ రావడంతో..స్వల్ప మెజారిటీతో గెలిచింది.

ఇక ఈ సారి ఎన్నికల్లో చేవెళ్ళ పరిధిలో త్రిముఖ పోరు జరిగే అవకాశాలు ఉన్నాయి. బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి-కాంగ్రెస్ ల మధ్య పోరు నడవనుంది. మహేశ్వరం, పరిగి, వికారాబాద్, తాండూరు స్థానాల్లో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ ఉండే ఛాన్స్ ఉంది. మిగిలిన స్థానాల్లో త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది. అయితే కాంగ్రెస్ గట్టిగా కష్టపడితే ఇక్కడ మంచి ఫలితం రాబట్టవచ్చు. చూడాలి మరి ఈ సారి చేవెళ్లలో పై చేయి ఎవరిదో.

Read more RELATED
Recommended to you

Latest news