సీఎం కేసీఆర్‌ దోస్తానతో ఆ మేయర్ ఎవరిని లెక్క చేయరా ?

-

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసి ఖమ్మం ఆస్పత్రికి తరలించిన సమయంలో సూపరింటెండెంట్‌గా ఉన్నా ఆ డాక్టర్ ఆ తర్వాత పరిణామాల్లో ఖమ్మం తొలి మేయర్ గా బాధ్యతలు చేపట్టారు. పేరుకి అధికార పార్టీ ప్రజాప్రతినిధే అయినా.. టీఆర్‌ఎస్‌ నేతలతో అంటీముట్టనట్టు ఉంటారు. ఇక జిల్లా మంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ఏ సూచన చేసినా ఆయన లైట్ తీసుకుంటరట..


డాక్టర్‌ పాపాలాల్‌ ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ తొలి మేయర్‌. వచ్చే నెలతో మేయర్‌గా ఆయన పదవీకాలం పూర్తవుతుంది. మొదటి నుంచి అధికార పార్టీలో రెబల్‌ అని చెవులు కొరుక్కుంటాయి టీఆర్‌ఎస్‌ వర్గాలు. మేయర్‌గా చివరి సమావేశాన్ని కూడా జరపనివ్వలేదని పార్టీ వర్గాల్లో అసంతృప్తి ఉంది. అభివృద్ధి విషయంలోనూ ఆయన తీరు వేరని కథలు కథలుగా చెబుతారు. తన డివిజన్‌కు తప్ప ఇతర డివిజన్లకు పెద్దగా నిధులు విదిలించరనే ఆరోపణలతో పదవీ కాలం చివరిలో కొత్త వివాదాలు తెచ్చిపెట్టుకున్నారు.

ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్‌ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రానికి మంత్రి అయినా.. ఖమ్మం మున్సిపాలిటీలో మాత్రం ఆయన మాట చెల్లుబాటు కాకుండా మేయర్‌ అడ్డుకుంటున్నారనే అభిప్రాయం అధికార పార్టీ వర్గాల్లో ఉంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్సీ బాలసాని జోక్యం చేసుకున్నా..పాపాలాల్‌ వెనక్కి తగ్గలేదని సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసి ఖమ్మం ఆస్పత్రికి తరలించిన సమయంలో సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ పాపాలాల్‌ ఉన్నారు. ఆ సమయంలో చికిత్స పేరుతో కేసీఆర్‌కు దగ్గరైయ్యారు. దాని ఫలితమే తర్వాతి కాలంలో డాక్టర్‌ పాపాలాల్‌ మేయర్‌ పాపాలాల్‌ అయ్యారని గులాబీ వర్గాలు గుసగుసలాడుకుంటాయి. ఆ పరిచయం వల్లే జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతలను మేయర్‌ లెక్క చేయరనే ముద్ర పడింది.

ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు అంతా ఒక ఎత్తు.. మేయర్‌ మరో ఎత్తు అన్నట్టుగానే ఐదేళ్లు గడిచిపోయింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏ పనులు కాకపోవడంతో మేయర్‌ను తప్పించేందుకు అప్పట్లో మంత్రి అజయ్‌ తీవ్రంగా ప్రయత్నించినట్టు చెబుతారు. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికల సమయం దగ్గర పడటంతో.. చివరి రోజుల్లో అభివృద్ధి పనుల స్పీడ్‌ పెంచాలని కార్పొరేటర్లు, మంత్రి భావిస్తున్నారు.డివిజన్‌కు 50 లక్షలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ అంశం కొలిక్కి రాలేదు కానీ.. మేయర్‌ మాత్రం తన డివిజన్‌కు కోటి 30 లక్షల విలువైన అభివృద్ధి పనులు కేటాయించుకున్నారన్న విషయం గుప్పుమంది. దీనిపై వివాదం రేగడంతో మంత్రి అజయ్‌ మేయర్‌కు ఫోన్‌ చేసినట్టు సమాచారం. మంత్రి చెప్పినా పాపాలాల్‌ వినలేదని చెబుతున్నారు. మంత్రి మాటపై ఎమ్మెల్సీ బాలసాని ఎంట్రీ ఇచ్చినా వినలేదట. దాంతో ఎవరైతే నాకేంటి అని మేయర్‌ విసురుతున్న సవాళ్లు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి. మంత్రి చెప్పినా వినని పాపాలాల్‌.. ఇక మేం చెబితా వింటారా అని కార్పొరేటర్లు.. టీఆర్‌ఎస్‌ నేతలు గప్‌చుప్‌ అయ్యారట.

Read more RELATED
Recommended to you

Latest news