సాగర్ బైపోల్:ఆ ముగ్గురిలో కేసీఆర్ ఎవరికి చాన్స్ ఇస్తారో ?

-

నాగార్జునసాగర్ బైఎలక్షన్‌పై గ్రౌండ్‌వర్క్ మొదలుపెట్టింది టీఆర్ఎస్. పార్టీ నేతలను పంపి నియెజకవర్గంలో ఉన్న రాజకీయ, సామాజిక సమీకరణాలను అంచనా వేస్తోంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఢీకొట్టే నేత కోసం అన్వేషణ మొదలుపెట్టింది గులాబీ పార్టీ. పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తోన్న నాయకులు ఎవరు..ప్రధానంగా టిక్కెట్ రేసులో ఉన్న ఆ ముగ్గురు నేతల పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరు బరిలో దిగబోతున్నారు..పార్టీ ఎవరి పేర్లను పరిశీలిస్తోంది అన్నది ఇప్పుడు గులాబీదళంలో ఆసక్తి రేపుతుంది.దుబ్బాక ఉపఎన్నిక తర్వాత రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు వచ్చాయన్న ప్రచారానికి నాగార్జున సాగర్‌లో బ్రేక్ వేయలన్న ఆలోచనలో టీఆర్‌ఎస్‌ ఉందని సమాచారం. అందుకే ఎన్నడూ లేని విధంగా ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది అధికారపార్టీ.

కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి పోటీలో ఉంటారన్న ప్రచారం జోరందుకోవడంతో.. ఆయన్ని ఢీకొట్టే నేతలు ఎవరున్నారన్నదానిపై టీఆర్‌ఎస్‌లో వడపోతలు మొదలయ్యాయి. ఈ అంశంపై లోతైన చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న తేరా చిన్నపరెడ్డి పేరు ప్రచారంలో ఉంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు చిన్నపరెడ్డి. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. రెడ్డి సామాజికవర్గ నేత కావడంతోపాటు ఆర్థికంగా బలంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా పార్టీలో లెక్కలు వేసుకుంటున్నారు.

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరుపైనా పార్టీలో చర్చ జరుగుతోందట. ఆయన గతంలో మూడుసార్లు నల్లగొండ ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన పరిస్థితుల్లో అక్కడి వారితో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. అయితే ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని గుత్తా సన్నిహితులు చెబుతున్నారు. బలమైన అభ్యర్థి కావాలని అనుకుంటే.. గుత్తావైపు టీఆర్‌ఎస్‌ మొగ్గు చూపినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది.

జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నేత MC కోటిరెడ్డి పేరు కూడా పార్టీ చర్చలో ఉంది. రేస్‌లో ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తున్నట్టు పార్టీ వర్గాల టాక్‌. 2018 ఎన్నికల సమయంలోనే నాగార్జునసాగర్‌ నుంచి పోటీ చేయడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. పైగా కోటిరెడ్డికి మంత్రి జగదీష్‌రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. పార్టీ అధిష్ఠానం దృష్టికి కోటిరెడ్డి పేరును మంత్రి ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం.

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఉపఎన్నిక కావడంతో రాజకీయవర్గాల దృష్టి అంతా నాగార్జునసాగర్‌పైనే ఉంది. ఎలాంటి ఛాన్స్‌ తీసుకోకూడదని భావిస్తోన్న టీఆర్‌ఎస్‌.. పోటీ చేయడానికి ఎవరికి అవకాశం ఇస్తుందన్నది ఆసక్తిగా మారుతోంది. సామాజిక సమీకరణాలు ఎవరికి కలిసి వస్తాయి.. ఆర్థికంగా ఎవరు బలమైన నాయకుడు ఇలా ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారట పార్టీ పెద్దలు.

Read more RELATED
Recommended to you

Latest news