అయోధ్య విరాళాలపై టీఆర్‌ఎస్‌ ఉలికిపాటు అందుకేనా

-

అయోధ్య రామాలయ నిర్మాణం విరాళాల సేకరణపై టీఆర్ఎస్ నేతలు కామెంట్స్ పై ఇప్పుడు కొత్త చర్చ నడుస్తుంది. సున్నితమైన అంశం పై రోజుకో నేత ఏదో ఒక కామెంట్ చేసి వివాదాన్ని లైమ్ లైట్ లో ఉంచుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుండగా ఒక్క తెలంగాణలోనే టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. విరాళాల వ్యవహారంలో గులాబీ పార్టీ నేతలు ఉలికిపాటు వెనుక కారణం ఏమిటా అన్నదాని పై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాల సేకరణను దేశవ్యాప్తంగా ప్రారంభించింది రామ జన్మభూమిట్రస్ట్. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ ఎలా సాగుతున్నా.. తెలంగాణకు వచ్చే సరికి అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు.. స్పందిస్తున్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. గులాబీ నేతలు అలా మాట్లాడుతున్నారా లేక టీఆర్ఎస్ ఒక స్టాండ్ తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అప్పట్లో విరాళాల సేకరణలో పాల్గొన్నారు. భారీ ర్యాలీ నిర్వహించారు కూడా. ఆ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అడుగులు వేశారని అప్పట్లో చర్చ జరిగింది. ఇది పెద్దగా వివాదం కాకపోయినా.. తర్వాత మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన కామెంట్స్‌ చర్చకు దారితీయడమే కాదు.. రచ్చ రచ్చ అయింది.

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు రామాలయ విరాళాలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ ఆయన్ని టార్గెట్ చేసింది. ఆ తర్వాత మరో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన కామెంట్స్‌ అయితే పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ధర్మారెడ్డికి అధికార పార్టీ నేతలు మద్దతు పలికారు. విరాళాల సేకరణపై లెక్కలు అడిగితే తప్పేంటని నిలదీశారు. అదే జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సైతం ఆ జాబితాలో చేరారు. తనదైన శైలిలో పదునైన విమర్శలే చేశారాయన. బీజేపీ నేతలు అడ్డగోలుగా చందాలు వసూలు చేస్తున్నారని.. దీనికి తాను వ్యతిరేకమని అన్నారు మరో మంత్రి సత్యవతి రాథోడ్‌.

ఈ విషయంలో పార్టీ ఒక అభిప్రాయానికి రాలేకపోవడంతో.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. మంత్రులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడేస్తున్నారు. విరాళాల పేరుతో బీజేపీ, సంఘ్‌ పరివార్‌ నేతలు జనాల్లోకి వెళ్లడం వారిని టెన్షన్‌ పెడుతోంది. ఒకవేళ టీఆర్‌ఎస్‌ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఆ క్రెడిట్‌ బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది. అందుకే గులాబీ శిబిరం డోలాయమానంలో పడినట్టు సమాచారం. ఒకవైపు విరాళాల సేకరణ చేస్తూనే.. టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలపైనా పోరాటం చేస్తూ రాజకీయ వేడి రగిలిస్తున్నారు కమలనాథులు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. ఆ పార్టీని మరింత బలంగా ఢీకొట్టాలన్నది బీజేపీ వ్యూహం. అందుకే విరాళాల సేకరణ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న కామెంట్స్‌ను అస్సలు విడిచిపెట్టడం లేదు. మాటకు మాట బదులిస్తూ ఇంకా చర్చ జరిగేలా చేస్తుంది. విరాళాలపై ఒక స్టాండ్‌ తీసుకోకపోవడంతోనే టీఆర్ఎస్ ఈ ఊబిలో ఇరుక్కుందా అన్న చర్చ నడుస్తుంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news