ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుందా

-

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఈ దఫా సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకుని ఫీల్డ్‌లోకి వెళ్లింది. దీంతో కొందరు ఎమ్మెల్యేలలో టెన్షన్ పట్టుకుంది. పార్టీ పెద్దలు స్వయంగా పర్యవేక్షిస్తున్నా కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు చాలా వెనకబడి ఉండటం దీనిపై అధిష్టానం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండటం ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తుందట..50 వేలు టార్గెట్ విధిస్తే కేవలం 30 వేల సభ్యతాలు మాత్రం పూర్తి చేసిన ఎమ్మెల్యేల్లో కేటీఆర్ ఇచ్చిన వార్నింగ్ తో కొత్త టెన్షన్ మొదలైందట.

కొన్ని నియోజకవర్గాలలో సభ్యత్వ నమోదులో ఎమ్మెల్యేలు.. పార్టీ నేతలు లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో పార్టీ గడువు పెంచింది. ఇంకో వారం రోజుల టైమ్‌ ఇచ్చిన తర్వాత పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈ అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ మాట్లాడారట. ఎమ్మెల్యేలు నరేందర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌లతో మాట్లాడిన సమయంలో వారు చెప్పిన సమాధానానికి కేటీఆర్‌ సంతృప్తి చెందలేదన్నట్టు సమాచారం. మరో వారం రోజులు టైమ్‌ ఇచ్చినందున ఆ గడువులోగా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన నిర్దేశించారట.

ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నా పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది గులాబీ పెద్దల సూచన. ఆ మేరకు కొందరు టార్గెట్‌ రీచ్‌ కావడం.. మరికొందరు వెనకబడటం తెలంగాణ భవన్‌లో చర్చకు దారితీస్తోంది. మరోవైపు పొడిగించిన సమయం కూడా దగ్గర పడుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు పొడిగించిన గడువులోగా ఏ మేరకు సక్సెస్‌ అవుతారన్నది ఆసక్తిగా మారింది. అలాంటి వారు ఎవరా అని మరికొందరు ఆరా తీస్తున్నారు.

ఇన్నాళ్లూ జరిగిన ఎన్నికలు చేసిన ప్రగతి ఒక ఎత్తు అయితే పార్టీ సభ్యత్వ నమోదులో ఎవరు క్రియా శీలకంగా పనిచేశారన్నదే ప్రామాణికంగా తీసుకుంటారన్న ప్రచారం మొదలైంది. ఎవరు బాగా పనిచేశారు.. ఎవరు ఎందుకు వెనకబడ్డారు అన్న అంశాలను సమగ్రంగా పార్టీ అధినేత కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తారని కూడా చెబుతున్నారు. అందుకే టార్గెట్ రీచ్ అవ్వని ఎమ్మెల్యేల్లో కొత్త టెన్షన్ పట్టుకుందట.

Read more RELATED
Recommended to you

Latest news