టీఆర్ఎస్ పదవుల పందేరం..ఎమ్మెల్సీ రేసులో ముందున్న నేతలు వీరే

-

తెలంగాణ పదవుల పందేరం మొదలైంది. తెలంగాణ శాసన మండలిలో త్వరలో భారీ సంఖ్యలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ పదవుల పై కన్నేశారు గులాబీ పార్టీ నేతలు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల భర్తీ సైతం పెండింగ్ లో పడింది. అయితే శాసన మండలిలో త్వరలో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు,గవర్నర్ కోటా నుంచి ఒకటి ఖాళీ అవుతుండటంతో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు ఆశవాహులు.

శాసనమండలిలో ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎవరికి చాన్స్ దక్కుతుందనేది ఆసక్తి రేపుతుంది. ఎమ్మెల్సీ పదవుల కోసం పార్టీలో తీవ్ర పోటి ఉండడంతో టిఆర్ఎస్ అధిష్టానం ఎవరికి చాన్స్ ఇస్తుందనే దాని పై పార్టీ వర్గాల్లో రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రస్థుతం పదవిలో ఉన్న నేతలల్లో మళ్లీ ఎవరికి చాన్స్ దక్కుతుంది..కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనేదాని పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలో కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు శాసన మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ,వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ ,మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, ఫరీదుద్దీన్ ల పదవి కాలం జూన్‌లో ముగుస్తుంది.

ప్రస్తుతం పదవీ కాలం ముగస్తున్న ఆరుగురు ఎమ్మెల్సీలలో గుత్తా సుఖేందర్ రెడ్డి,బోడకుంటి వెంకటేశ్వర్లుకు మాత్రమే మళ్లీ చాన్స్ దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్ శాసనమండలి పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయడంలో కీలకపాత్ర వహించిన ఆకుల లలితకు త్వరలో కార్పోరేషన్ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. ఇక కడియం శ్రీహరి,ఫరీదుద్దీన్ ని పార్టీ పరంగా వాడుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నేతి విద్యాసాగర్ వయో భారం కారణంగా మళ్ళీ చాన్స్ దక్కడం అనుమానంగానే ఉంది.

2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి సారి ఇంత పెద్ద స్థాయిలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అప్పుడు ఎన్నికల సమయంలో టిక్కెట్ దక్కని వారికి మరో రూపంలో అవకాశం ఇస్తామని పార్టీ హమీ ఇచ్చింది. ఇప్పుడలాంటి నేతలంతా రేసులో ఉన్నారు. గతంలో చాన్స్ మిస్ అయిన సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌,సీఎం సన్నిహితుడు మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి,మాజీ ఉద్యోగ సంఘం నేత దేవీ ప్రసాద్,ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఇటీవలే ఎమ్మెల్సీ హామీ పొందిన సాగర్ నేత కోటిరెడ్డి ఇలా ఆశావహులు పలువురు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

ఇక టిఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నవారు రాజకీయ కారణాలతో పార్టీలో చేరిన వారు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు .ఇప్పటికే పార్టీ పెద్దలకు దగ్గరగా ఉన్న వారితో చాన్స్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారన్న చర్చ జరుగుతోంది.
ఖాళీ అయిన ఈ స్థానాలకు మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news