రాష్ట్రంలో సాండ్ మైనింగ్, భూ మాఫియా, లిక్కర్ మాఫియా ఇలా అన్ని మాఫియాలకు టిఆర్ఎస్ పార్టీ అడ్డాగా మారిందని అన్నారు మధ్యప్రదేశ్ బిజెపి ఇన్చార్జ్ మురళీధర్ రావు. రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాలలో వ్యతిరేకత ఉందన్నారు. వాగ్దానాలతో మోసపోయిన ప్రజలు బిజెపి వైపు చూస్తుంటే.. దాన్ని అడ్డుకోవడానికి ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి కార్యకర్తలు ప్రాణాలు అర్పించడానికి అయినా సిద్ధంగా ఉంటారని అన్నారు మురళీధర్ రావు.
బిజెపి పార్టీకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. గుండాలతో బెదిరించి భయపెట్టాలని చూస్తే అది మీ పగటి కలేనని అన్నారు. దేశంలో ఎదురులేదని అహంకారంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తోక పార్టీలా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బిజెపి కార్యకర్తలను అరెస్టు చేయని రోజే లేదని ఫైర్ అయ్యారు మురళీధర్ రావు. పల్లెలలో బెల్ట్ షాపులు పెరిగిపోయాయని.. మద్యపానం విషయంలో బిజెపి ప్రశ్నిస్తోందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రను ఆపే హక్కు ఎవరికీ లేదన్నారు మురళీధర్ రావు.