జూన్ 8న తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఅర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో వైద్యం, కరోనా పరిస్థితులు, నీటి పారుదల, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్‌డౌన్ (Lockdown) నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాల మీద చర్చించనున్నారు.
రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిపే అవకాశమున్నది. అలానే వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమైన నేపథ్యంలో రైతుబంధు సాయం, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో వివిధ శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించడంతో పాటు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలో నేపథ్యంలో, థర్డ్ వేవ్ ను కూడా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధతపై కూడా కేబినెట్ చర్చించనుంది. కరోనా కట్టడికోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలోరాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మేరకు ప్రభావితమైంది అనే అంశాల మీద కేబినెట్ చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనుంది.ప్రస్తుత లాక్‌డౌన్ జూన్ 9న ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేయాలా లేక మరిన్ని సడలింపులు ఇవ్వాలా అనే అంశంపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.
సోమవారం రోజున 19 జిల్లాల్లో 19 డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలనుకున్న సీఎం కేసీఆర్… ఆ కార్యక్రమాన్ని జూన్ 9 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అందరు మంత్రులు ఏక కాలంలో పాల్గొని ఒకే రోజు ఒకే సమయంలో 19 సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, మంత్రులు లేని చోట ఇతర ప్రముఖులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పాల్గొనాలనే విషయం మీద కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.