రాష్ట్రంలో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం రాతపరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ ఎ గోవర్ధన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 14,15 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి 94,225 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వారి కోసం తెలంగాణలో 68, ఏపీలో 18 కలిపి మొత్తం 86 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి రోజూ రెండువిడతల్లో పరీక్షలుంటాయని పేర్కొన్నారు.
ఒక్కో విడతకు సుమారు 23,500 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు కేటాయించామని తెలిపారు. తొలివిడత ఉదయం 9 నుంచి, మధ్యాహ్నం రెండోవిడత మూడు గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని వివరించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులకు అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు. సవరించిన హాల్‌టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 18 నుంచి 20 వరకు షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ ఇంజినీరింగ్ రాతపరీక్షలు పూర్తయ్యాయి. ఎంసెట్ అగ్రికల్చర్ రాతపరీక్షలు పూర్తయ్యాకే ఫలితాలు విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించిన విషయం తెలిసిందే.