పసుపు గ్రేడింగ్ లో ఈ పద్దతులు పాటిస్తే కాసుల పంటే..!

-

ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండటంతో పసుపు దిగుబడులు పెరిగే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తన్నారు. త్వరలో మార్కెటింగ్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. పసుపు విక్రయంలో రైతులు మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక ధరలు పొందవచ్చు. పసుపు వండటం నుంచి గ్రేడింగ్ వరకు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఏడాది మాంచి. గిరాకీని అందుకునే అవకాశం ఉంటుంది.

గ్రేడింగ్..

పసుపు మార్కెటింగ్ లో కీలకమైనది గ్రేడింగ్, కొమ్ములను వేరుచేయటంతో పాటు.. పుచ్చు విషయంలో జాగ్రత్త వహించాలి. పుచ్చు సరకును ఏమాత్రం కలవకుండా చూసుకోవాలి. మూడు, నాలుగు అంగుళాల పొడవు కలిగిన కొమ్ములను బస్తాల్లో నింపి.. మార్కెట్ కు తరలించాలి. కొమ్ముల చుట్టూ పిలకలను తుంచటం లేదా పాలిషింగ్ వేరయ్యేలా చూసుకోవడం ముఖ్యం.. కొమ్ములకు కూడా ఎలాంటి పిలకలు లేకుండా చూడాలి.

వండకం

పసుపు వండకంలో ఇప్పటికీ ఎక్కువ మంది రైతులు పురాతన, సాంప్రదాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. బానల ద్వారా వండకంలో కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. అధిక సమయం పడుతుంది. ఇందుకు బదులుగా బాయిలర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో అధిక ఉష్ణోగ్రతలపై ఉడికించడం వల్ల పనిని సులువుగా, వేగంగా అవుతుంది..ఇలా వండిన పసుపు త్వరగా ఎండుతుంది. ప్రస్తుతం బాయిలర్లు చాలా గ్రామాల్లో అందుబాటులో ఉన్నాయి. అద్దె ప్రాతిపదికన బాయిలర్లతో వండకాన్ని రైతులు అలవర్చుకోవాలి. బాయిలర్లలో ఉష్ణోగ్రత మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. దుంప ఎక్కువ ఉడికితే.. నీటి శాతం తగ్గి, బరువు తగ్గుతుంది..

ఎండబెట్టడం…

పసుపును పొలంలోనే ఆరుబయట నేలపై ఎండబెడుతుంటారు. కల్లం తయారుచేసే సమయంలో నిర్ణీత స్థలాన్ని ఎత్తు మడులుగా ఏర్పాటు చేసుకోవాలి. వర్షాలు కురిసినా ఇబ్బంది లేకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.. బండలు, సిమెండ్ గచ్చుతో కూడా బెడ్లను ఏర్పాటు చేయవచ్చు. కొన్నిచోట్ల రైతులు కాంక్రీట్తో శాశ్వత ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. రాత్రిపూట మంచు నుంచి రక్షణకు సిల్పాలిన్, టార్పాటిన్ పట్టాలను కప్పాలి. మార్చిలో కూడా మంచు కురుస్తున్నందున రైతులు పట్టాలను సిద్ధంగా ఉంచుకోవాలి.

పాలిషింగ్

పసుపు కొమ్ములపై చిన్న చిన్న వంపులు ఉండకుండా పాలిష్ చేయాలి. మార్కెట్లో పాలిష్ చేసిన సరకుకు అధిక డిమాండ్ ఉంటుంది. విద్యుత్తు, ట్రాక్టర్తో పనిచేసే పాలిషింగ్ యంత్రాలు ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులోకి వచ్చాయి.. పాలిషింగ్ను తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది.

కర్కుమిన్ శాతం పెంచేందుకు

పసుపులో కర్కుమిన్ శాతం అధికంగా ఉండే రకాలకు అధిక గిరాకీ ఉంటుంది. కొన్ని రకాలకు స్వతహాగా కర్కుమిన్ శాతం అధికంగా ఉంటుండగా.. మరి కొన్నింటిలో యాజమాన్య పద్ధతులతో ఈ శాతాన్ని పెంచుకోవచ్చు.. కర్కుమిన్ 2.5, 3 శాతం ఉండే పసుపు రకాలకు ధర కాస్త తక్కువగా పలుకుతుండగా.. 6, 7 శాతం ఉండే రకాలకు మంచి ధర

లేటెస్ట్ టెక్నిక్

కొమ్ములను చిన్న ముక్కలుగా (ఫ్లేక్స్) మార్చి, సోలార్ డ్రయ్యర్లలో ఎండబెట్టి ఇటీవల మార్కెట్ చేస్తున్నారు. ఈ విధానానికి మార్కెట్లో ఆదరణ బాగా ఉంది. సోలార్ డ్రయ్యర్లలో ఎండబెడితే.. కర్కుమిన్ శాతం అలాగే నిలిచిపోతోంది. మహారాష్ట్ర, తమిళనాడులో ఈ తరహా డ్రైయింగ్ విధానం ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. సంప్రదాయ పద్ధతిలో ఆరుదలకు (ఎండబెట్టడం) 20 నుంచి 25 రోజులు పడుతుండగా.. సోలార్ డ్రయ్యర్లలో 7 నుంచి 10 రోజుల్లోపే పూర్తిగా, సమానంగా ఎండుతుంది. పదేపదే కలియ తిప్పాల్సిన పనిలేదు.
గ్రేడింక్ లో ఈ పద్దతులు పాటించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చు,
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news