మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన రామచంద్రభారతిపై నేడు (బుధవారం) బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. ఆయన వద్ద రెండు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ రాజేంద్రనగర్ ఏసీపీ, సిట్ సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు ఆయన ల్యాప్‌టాప్‌ను పరిశీలించగా రెండు ల్యాప్‌టాప్‌ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండు వేర్వేరు నంబర్లతో ఆయన పాస్‌పోర్టులు తీసుకున్నట్టు గుర్తించారు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్సులు కూడా ఒక్కోటి మూడు చొప్పున ఉన్నట్టు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రభారతిపై గతంలోనే కేసు నమోదైంది.
కాగా, దర్యాప్తు పేరుతో సిట్ అధికారులు తనను వేధిస్తున్నారంటూ న్యాయవాది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని చెప్పడంతో తాను ఇతర పనులు చేసుకోలేకపోతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ కోర్టుకు తెలిపారు. దర్యాప్తుతో సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారని ఆరోపించారు. ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిగా ప్రశ్నిస్తుండడడం వల్ల శ్రీనివాస్ ఒత్తిడికి గురవుతున్నారని కోర్టుకు తెలిపారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ నెల 25న సిట్ ఎదుట హాజరై అధికారులు ఇది వరకే అడిగిన సమాచారాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది.