హైదరాబాద్‌ చైన్ స్నాచింగ్ కేసు.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

-

హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు కలకలం సృష్టించారు. ఒక్కసారిగా రెచ్చిపోయిన గొలుసు దొంగలు నగరంలో రెండు గంటల వ్యవధిలో 6 చోట్ల మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఉదయం 6గంటల 20 నిమిషాల నుంచి 8 గంటల 10 నిమిషాల వరకు వివిధ చోట్ల హడలెత్తించారు.

ఉప్పల్‌ పరిధిలోని రాజధాని ప్రాంతంతో పాటు కళ్యాణపురి, నాచారంలోని నాగేంద్రనగర్‌, ఓయులోని రవీంద్రనగర్‌, చిలకలగూడలోని రామాలయం గుండు, రాంగోపాల్‌పేట్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో ఆగంతుకులు మహిళల మెడల్లో నుంచి బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఉదయం ఉప్పల్‌లో మొదలుపెట్టి.. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌ వరకు వరుసగా 6 గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు.

బాధితుల ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు. ఈ దొంగలు దిల్లీకి చెందిన అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వేస్టేషన్లు వద్ద నిఘా ఏర్పాటు చేసి.. అనుమానితులను, ఇతర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను అలెర్ట్ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమై.. అన్ని రైల్వే స్టేషన్లపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే కాజీపేట రైల్వేస్టేషన్లో ఇద్దరు అనుమానితులను వరంగల్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news