మొన్నటి వరకు ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర రాజకీయ షిండే సీఎం అవడంతో చల్లారింది. అయితే ఇప్పుడు మళ్లీ మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. వెంటనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి మీడియాతో మాట్లాడిన ఉద్ధవ్.. ఎలక్షన్ పెడితే జనం ఎవరివైపు ఉన్నారో తేలిపోతుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలను శివసేన పార్టీ గుర్తుపై పోటీ చేయనిచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు ఉద్ధవ్.
మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలే తీర్పు చెబుతారని, ఒకవేళ తను తప్పు చేసి ఉంటే ప్రజలే తనను ఇంటికి సాగనంపుతారని అన్నారు ఉద్ధవ్. వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టాలనుకునుకుంటే రెండున్నరేళ్ల క్రితమే చేసి ఉండాల్సిందని అన్నారు ఉద్ధవ్. శివసేన పార్టీ గుర్తును ఎవరూ తన నుంచి తీసుకోలేరని.. జనం కేవలం పార్టీ సింబల్ చూసి ఓటేయరని, అది ఎవరి దగ్గరుందన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని అన్నారు ఉద్ధవ్. శివసేన రెబల్ ఎమ్మెల్యేలపైనా ఉద్ధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు తనతో పాటు తన కుటుంబాన్ని టార్గెట్ చేసినా ఎవరూ నోరు మెదపలేదని మండిపడ్డారు ఉద్ధవ్.