పాత్రాచల్ భూ కుంభకోణం కేసులో అరెస్టయిన శివసేన నేత సంజయ్ రౌత్ కుటుంబాన్ని సోమవారం ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పరామర్శించారు. రౌత్ తల్లి, భార్యాబిడ్డలను ఓదార్చారు. ఈ సందర్భంగా భాజపా పాలనను నియంత హిట్లర్ కాలంతో పోల్చి తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలాగే సూపర్ హిట్ చిత్రం పుష్పలోని తగ్గేదేలే డైలాగ్‌ను ప్రస్తావించారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఠాక్రేతో సంజయ్ రౌత్ సన్నిహితంగా మెలిగేవారు. పార్టీ కార్యకలాపాలను అన్నీ తానై పర్యవేక్షించేవారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఏ కూటమి అధికారంలో ఉన్న సమయంలో.. తమ ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు దీటుగా బదులిచ్చేవారు. ఇప్పుడు ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. ఈ క్లిష్ట సమయంలో రౌత్ కుటుంబానికి ఉద్ధవ్ అండగా నిలిచారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
‘రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒక పాయింట్ వద్ద నియంత హిట్లర్ గెలుస్తున్నట్లు కనిపించాడు. కానీ అతడి కార్టూనిస్ట్ మాత్రం అతడి దుర్మార్గాలను ఎత్తిచూపారు. అప్పుడు ఆ కార్టూనిస్ట్ చనిపోవాలని హిట్లర్ కోరుకున్నాడు. ఈ ఉదంతాన్ని ఓ సందర్భంలో నా తండ్రి నాకు చెప్పారు.’ అని ఉద్ధవ్ అన్నారు.
‘మీరు(భాజపా) ఈడీ, సీబీఐపై ఆధారపడుతుంటే.. ఇంక దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? సంజయ్ రౌత్ పట్ల గర్వంగా ఉంది. ఆయన ఎలాంటి ఒత్తిడికి తలొగ్గకుండా ముందుకు సాగుతున్నారు. అసలు ఆయన చేసిన నేరేమంటి? ఆయనొక పాత్రికేయుడు. శివసైనికుడు. ఏం జంకూ లేకుండా తాను చెప్పాలనుకున్నది చెప్తారు’ అంటూ రౌత్‌ను ప్రశంసించారు. అలాగే ఈ సందర్భంగా పుష్ప సినిమాలోని తగ్గేదేలే డైలాగ్‌ను గుర్తుచేశారు. తమ నేత సంజయ్ రౌత్ కూడా ఎక్కడా తలొగ్గలేదని కొనియాడారు.