ఉక్రెయిన్​ చావు దెబ్బ.. రాకెట్ల దాడిలో 400 మంది రష్యా సైనికులు మృతి

-

ఉక్రెయిన్​తో యుద్ధంలో రష్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్​ ఎదురుదాడిలో రష్యా పెద్దఎత్తున ప్రాణనష్టాన్ని చవిచూసింది. తూర్పు దొనెట్స్క్‌ ప్రాంతంలో రష్యా సైనికులు బసచేసిన శిబిరంపై జెలెన్‌స్కీ సేన అమెరికా తయారీ ‘హిమార్స్‌’ రాకెట్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 400 మంది రష్యా సైనికులు హతమయ్యారని, మరో 300 మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ ప్రకటించింది. వీరంతా దొనెట్స్క్‌ ప్రాంతంలోని మకివ్కాలో ఒక వృత్తి విద్యా పాఠశాలలో బసచేసి ఉండగా దాడి జరిగింది. తమకు నష్టం జరిగిన మాట వాస్తవమేనని, మృతిచెందింది 63 మంది అని రష్యా రక్షణ శాఖ సైతం అంగీకరించింది.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం అర్ధరాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది సేపటి తర్వాత ఈ దాడి జరిగినట్లు సమాచారం. రష్యా వైపు ఎంతమంది చనిపోయారన్న దానిపై స్వతంత్ర సంస్థల నుంచి ధ్రువీకరణ లేదు. లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో తాకడంలో హిమార్స్‌ రాకెట్లకు తిరుగులేదు. వీటి సాయంతో జెలెన్‌స్కీ సేన కొంతకాలంగా రష్యా స్థావరాలపై విరుచుకుపడుతోంది. మకివ్కాలో రష్యా సైనికులు బస చేసిన స్థావరం పక్కనే భారీ మందుగుండు నిల్వ కేంద్రం ఉందని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌ రాకెట్‌ దాడివల్ల అది విస్ఫోటం చెందిందని వివరించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version