సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహిరంగ లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రామగుండం లో కేంద్ర ప్రభుత్వం నిర్మించదలచిన వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు విషయంపై ఆయన ఈ లేఖ రాశారు. ఈ లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు. “గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారికి నమస్కారం! విషయం : రామగుండం నందు కేంద్ర ప్రభుత్వం నిర్మించదలచిన 100 పడకల ESI ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు విషయం గురించి.

కార్మికులకు అవసరమైన వైద్య సేవలను మరింత సులభంగా పొందటానికి వీలుగా రామగుండం నందు కేంద్ర ప్రభుత్వం నిర్మించదలచిన 100 పడకల ESI ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి కేటాయింపు విషయంలో చొరవ చూపమని కోరుతూ 30.06.2022 నాడు D.O. No. MoCT&DoNER/Gen/Hyd/2022/2247 లేఖను మీకు వ్రాయడం జరిగింది. దీనికి ప్రతిగా తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి శ్రీ మల్లారెడ్డి గారు D.O. Lr No. 10/M(L&E,F&SD)/2022, Dt. 13.07.2022 లేఖను వ్రాయడం జరిగింది.

కార్మికశాఖ మంత్రి గారు వారి లేఖలో తెలిపినట్లుగా ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమిని రామగుండం పట్టణ శివార్లలో చూపించడం జరిగింది. ఈ భూమి పరిశీలన కోసం ESI ప్రాంతీయ కార్యాలయం, హైదరాబాద్ వారు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ సభ్యులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రభుత్వం చూపించిన భూమిని పరిశీలించి ఒక నివేదికను అందించడం జరిగింది.

నిపుణుల కమిటీ వారు అందించిన నివేదికలో ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించిన భూమిని గతంలో రామగుండం మునిసిపాలిటీ వారు డంపింగ్ యార్డుగా ఉపయోగించేవారని, భూమికి చుట్టుప్రక్కల 2 స్మశాన వాటికలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ఈ భూమిని చేరుకోవడానికి నేరుగా దారి లేదని, ప్రస్తుతం భూమి ప్రక్కనే ఉన్న పార్కు మధ్యగా నడిచి వెళ్లాలని, బస్టాండు లేదా రైల్వే స్టేషన్ నుండి కార్మికులు ఇక్కడకు చేరుకోవడానికి కూడా దూరమవుతుందని తెలియజేశారు. కార్మికులకు అనుకూలంగా లేని అనేక కారణాల రీత్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూపించిన భూమి ఆసుపత్రి నిర్మాణానికి అనువైనది కాదని భూమి పరిశీలన చేసిన నిపుణుల కమిటీ సభ్యులు తమ యొక్క నివేదికలో స్పష్టం చేశారు. గతంలో నేను మీకు వ్రాసిన లేఖను, కమిటీ సభ్యులు అందించిన నివేదికను కూడా ప్రస్తుత లేఖకు జోడించి పంపిస్తున్నాను.

కాబట్టి, కార్మికుల రాకపోకలకు వీలుగా ఉండేలా ఆసుపత్రి నిర్మాణానికి అనువైన ప్రత్యామ్నాయ భూమిని చూపించి వెంటనే కేటాయించేలా చూడగలరని తమరిని కోరుతున్నాను. ఇప్పటికే ఆలస్యం అయిన ESI ఆసుపత్రి నిర్మాణానికి కావలసిన భూమి కేటాయింపు త్వరగా పూర్తి చేయాలని కోరుచున్నాను”. ఆయన లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version