రోజురోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. యువతుల ఫోటోలను మార్ఫింగ్ చేసిన మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి నగరంలోని ఓ గ్రామానికి చెందిన యువతి చిత్రాన్ని అశ్లీలంగా మార్ఫింగ్ చేసిన ఘటన కలకలం రేపింది. మండల పరిషత్ కార్యాలయంలోని వైఎస్సార్ క్రాంతి పథం విభాగంలో పనిచేస్తున్న ఓ అధికారిణి, మరో ఇద్దరు సిబ్బంది చరవాణులకు వాట్సాప్ ద్వారా తమ జాబితాలో లేని ఫోన్ నంబర్ నుంచి ఓ యువతి చిత్రాన్ని అశ్లీలంగా మార్ఫింగ్ చేసి పంపినట్లు పోలీసులు తెలిపారు.
అది చూసి నివ్వెరపోయిన అధికారిణి, సిబ్బంది ఆ చిత్రం ఎవరిదో విచారించుకొని, తర్వాత పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. కాగా మార్ఫింగ్‌కు గురైన యువతి, ఆమె తల్లి దీనిపై పోలీసులను ఆశ్రయించారు. చిత్రాన్ని ఎవరు మార్ఫింగ్ చేశారు? కొందరి చరవాణులకే ఎందుకు వచ్చాయి? దీని వెనుక కారకులు ఎవరో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు పోలీసులు.