ఉత్తరాంధ్ర నుంచి బస్సు యాత్ర చేపట్టనుంది వైసీపీ సర్కారు. ఈ ఉదయం ఏడు గంటలకే సంబంధిత కార్యక్రమం మొదలయింది. మే 26 గురువారం నుంచి మే 30 ఆదివారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నగరాలు కలుపుకుని జరిగే బస్సు యాత్రకు ఉత్తరాంధ్రే ప్రారంభ స్థానం. స్టార్టింగ్ పాయింట్. ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్యక్రమానికి ఇవాళ తుది రూపు ఇచ్చారు వైసీపీ మంత్రులు. ఓవైపు దావోస్ లో జగన్ ఉంటుండగానే మరోవైపు ముందు నిర్ణయించిన షెడ్యూల్ అనుసరించి మంత్రుల జిల్లాల పర్యటన సాగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.
మరోవైపు మహానాడు హోరుతో చంద్ర బాబు వర్గం సిద్ధం అవుతోంది. చంద్రబాబు కూ ఉత్తరాంధ్రే సెంటిమెంట్. నాడు ఎన్టీఆర్ ను కూడా ఆదరించింది నెత్తిన పెట్టుకున్నది ఉత్తరాంధ్రే ! ముఖ్యంగా ఎన్టీఆర్ ను ఇప్పటి మటెక్కలి , పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గ ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. అదేవిధంగా చంద్రబాబుకు కూడా అదే మర్యాద దక్కింది. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ తరువాత అంతే స్థాయిలో ఆత్మ గౌరవ నినాదం వినిపించిన వైఎస్సార్కూ అపూర్వ రీతిలో అనూహ్య స్థాయిలో గౌరవం దక్కింది ఇక్కడే ! అదే సెంటిమెంట్ ను కొనసాగించారు జగన్.
నాన్న నడిచిన దారుల్లోనే నడిచి పాదయాత్ర ముగించి ఇక్కడి ప్రజల దీవెనలు అందుకున్నారు. అందుకే జగన్ కు ఉత్తరాంధ్ర అంటే విపరీతం అయిన సెంటిమెంట్. ఇక్కడి మనుషులు ఆత్మీయతల పంచే తీరుకు ముగ్ధులయిపోతారు ఏ పార్టీ నాయకులు అయినా సరే ! ఆ విధంగా జగన్ కూడా తన తండ్రి బాటలో ఇవాళ మరోసారి వెళ్తున్నారు. బస్సు యాత్ర కు శ్రీకాకుళం నుంచే సన్నద్ధం కావాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేసి సంబంధిత ప్రణాళికను కూడా సిద్ధం చేయించే దావోస్ వెళ్లారు.