భారతీయ రైల్వేల్లో నూతనంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ప్రమాదానికి గురైంది. గత వారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును స్వయంగా ప్రారంభించారు. ముంబై సెంట్రల్ నుంచి గుజరాత్ రాజధాని గాంధీ నగర్ మధ్య నడిచే ఈ రైలు గురువారం ఉదయం గుజరాత్‌లోని వాత్వా, మణి నగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. గేదెల మంద అడ్డు రాగా… గమనించిన లోకో పైలట్ రైలుకు సడన్ బ్రేక్ వేశారు. అయినా కూడా రైలు ఓ గేదెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగంలో ఉన్న మెటల్ ప్లేట్ విరిగిపోయింది.
ఈ ప్రమాదంపై విపక్షాలు వ్యంగ్యాస్త్రాలు సంధించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 6 రోజుల్లోనే వందే భారత్ రైలు ప్రమాదానికి గురైందంటూ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఈ ప్రమాదంపై సెటైర్లు గుప్పించింది. ఇదిలా ఉంటే… ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం మెటల్ ప్లేట్ మాత్రమే విరిగిందని చెప్పిన రైల్వే శాఖ…8 నిమిషాల్లోనే రైలు బయలుదేరిందని, గాంధీ నగర్‌కు సకాలంలోనే చేరుకుందని తెలిపింది.