జగన్ కు ధన పిశాచి ఆవహించిందా అనే అనుమానం కలుగుతోంది : వంగలపూడి అనిత

-

మరోసారి తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ‘సైకో’ పాలన పోయి ‘సైకిల్’ పాలన రావాలన్నారు. మంగళవారం తెలుగు మహిళా ఆధ్వర్యంలో ‘మాటామంతి’ కార్యక్రమం పోస్టర్ ను అనిత, తెలుగు మహిళ విభాగం నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్ ను నమ్మి ఓటేసి మహిళా వర్గం మోసపోయిందని అన్నారు. జగన్ ధన దాహానికి మహిళల తాళిబొట్లు తెగుతున్నాయని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. “ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మద్యాన్ని అరికడతానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి మహిళలను నమ్మించి మోసం చేశాడు. అమ్మఒడి, ఆసరా, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని మహిళలు జగన్ కు ఓట్లు వేయలేదు. కేవలం సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెబితేనే ఓట్లేశారు.

జగన్మోహన్ రెడ్డిని ఎన్నికలకు ముందు ఎక్కువగా ఆదరించింది మహిళలే. ప్రస్తుతం మహిళలను టార్గెట్ చేసి హింసిస్తున్నారు. రాష్ట్రంలో పూటకో అత్యాచారం జరుగుతుంటే దిశ చట్టం ఏమైంది? మహిళా కమిషన్ కు అత్యాచారాలు, హత్యలు జరిగిన వివరాల బుక్ ను ఇచ్చాం. క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మహిళా కమిషన్ లో చలనం లేదు. జగన్ ను, ఆయన సతీమణిని ఎవరైనా ఏమైనా అంటే డీజీపీ… మహిళా కమిషన్ కార్యాలయం మెట్లెక్కి ఫిర్యాదు చేస్తారు. అనేకమంది జే బ్రాండ్స్, గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మగనూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తి తన తల్లిపైనే అఘాయిత్యం చేయబోయాడు. తాగిన మత్తులో తల్లికి, చెల్లికి, ముసలివాళ్లకి, వికలాంగురాలికి కూడా తేడా లేకుండా వీరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. అనూష, తేజస్విని, శ్రీలక్ష్మి, రమ్య, స్నేహలతలు చంపబడితే దిక్కులేదు. రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగాయి. జగన్ కు ధన పిశాచి ఆవహించిందా అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్ర ఖజనాకు చేరే ఆదాయం కన్నా తాడేపల్లి ప్యాలెస్ కు చేరే ఆదాయం ఎక్కువ. ‘ అని వంగలపూడి అనిత మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version